baahubali--movie-baby-akshara“బాహుబలి-2” సినిమా మేనియా సినీ అభిమానులంద‌రినీ థియేట‌ర్లకు ర‌ప్పించుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఒక్క పాత్ర‌ను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అద్భుతంగా తీర్చిదిద్దడంతో అన్ని పాత్రలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అంటూ ఇద్దరు పసికందులు కూడా క‌నిపించారు. ఈ రెండు పాత్రల్లోనూ కనిపించింది ఒకే శిశువు. ఈ సినిమాలో క‌నిపించినందుకు ఆ శిశువు కూడా ఇప్పుడు సెలబ్రిటీ హోదాను అనుభవిస్తోంది.

శివ‌గామి ర‌మ్య‌కృష్ణ ఒడిలో ఆడుకున్న ప‌సికందుగా, అలాగే ఆమె ప్రాణ‌త్యాగం చేయ‌డంతో బ‌తికిన బాహుబ‌లిగా క‌నిపించిన‌ ఆ శిశువు ఎవ‌రు? అనే అంశం గతంలో హల్చల్ చేయగా, తాజాగా మరోసారి ఇదే అంశంపై సినీ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. ‘సిసింద్రీ’ సినిమాలో న‌టించిన అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌ లా… ‘బాహుబ‌లి’ సినిమాలో న‌టించిన ఈ చిన్నారి బాహుబ‌లి కూడా ఎవ‌ర‌యినా స్టార్ కుమారుడేనా? అని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇందులో ఆ చిన్నారి ‘బాహుబ‌లి’గా క‌నిపించింది అక్ష‌ర అనే ఓ పాప‌.

బాహుబలి సినిమా షూటింగ్ కేరళలోని అతురపల్లి జలపాతాల వద్ద జరుగుతుండగా, ఆ ప్రాంతంలోని అంగన్‌ వాడీ ప్రాంతానికి చెందిన వల్సన్ అనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ‘బాహుబలి’ కోసం పనిచేస్తున్న స‌మ‌యంలోనే అతడికి అప్పుడే ఈ పాప‌ జన్మించింది. అక్ష‌ర అని నామకరణం చేసిన ఈ పాప, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఇద్దరినీ పసికందులుగా చూపించినప్పుడు కనిపిస్తుంది. నిజంగా ఈ శిశువుని చూపించ‌కుండా మొదట గ్రాఫిక్స్ చేద్దాం అనుకున్నారట.

అయితే దర్శకధీరుడు రాజమౌళి మాత్రం బేబీ అక్షరను ‘బాహుబ‌లి’గా చూపిద్దాం అని ఫిక్స్ కావ‌డంతో ఆ పాప‌ పుట్టిన కొన్ని రోజుల‌కే ‘బాహుబ‌లి’లో క‌నిపించే అవ‌కాశం కొట్టేసింది. ఈ సినిమాలో న‌టించే సమయానికి ఆ పాప‌ అక్షర వయసు కేవలం 18 రోజులు మాత్రమే. అయితేనేం… ఇండియన్ సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సృష్టిస్తున్న ప్రభంజనంలో ఈ చిన్నారి కూడా తన వంతు పాత్ర పోషించింది. బహుశా పెరిగి పెద్దయితే… జీవితకాలం పాటు తను గర్వంగా చెప్పుకునే విషయంగా నిలబడిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.