baahubali-conclusion-rightsతెలుగు సినిమాను తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు గానీ… ‘బాహుబలి – ది కన్ క్లూజన్’కు జరుగుతున్న బిజినెస్ డీల్స్ ట్రేడ్ వర్గాలనే అవాక్కయ్యేలా చేస్తోంది. ఇటీవలే ఓవర్సీస్ హక్కులను 10 మిలియన్స్ కు కొనుగోలు చేసి హాట్ టాపిక్ అయిన ఈ సినిమా, తాజాగా నైజాం హక్కుల విషయంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఈ సినిమా హక్కులను ఏకంగా 50 కోట్ల ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ చిన్నపాటి కలకలమే రేపారు.

అయితే నిజంగా ఈ సినిమాకు అంత స్టామినా ఉందా? అన్న విషయాన్ని పరిశీలిస్తే… ఫస్ట్ పార్ట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపుగా 23 కోట్లకు కొనుగోలు చేయగా, దానికి రెట్టింపు మొత్తాన్ని షేర్ రూపంలో సొంతం చేసుకున్నాడు. మొత్తం గ్రాస్ కలెక్షన్స్ దాదాపుగా 70 కోట్ల వరకు నమోదయ్యాయి. మరి తాజా సినిమాకు హక్కులనే 50 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే… డిస్ట్రిబ్యూటర్ బయట పడాలంటే ‘బాహుబలి’కి రెట్టింపు స్థాయిలో వసూళ్లు ఉండాలి. మరి తెలుగు సినిమాకు నిజంగా అంత సీన్ ఉందా?

ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ నిలిచింది. రివ్యూలను, ప్రేక్షకుల పెదవి విరుపులను కూడా పట్టించుకోకుండా ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ ను ప్రేక్షకులు ఆదరించారు. మన తెలుగు దర్శకుడు హాలీవుడ్ స్థాయిలో తీసిన మొదటి చిత్రంగా ప్రేక్షకులలో ఒక ముద్రను వేసిన ‘బాహుబలి,’ ఆ సెంటిమెంట్ తో కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. మరి అదే సెంటిమెంట్ రెండవ సారి కూడా వర్కౌట్ అవుతుందా? లేక ఫస్ట్ పార్ట్ కంటే అద్భుతమైన రీతిలో సెకండ్ పార్ట్ ఉండనుందా?

ప్రస్తుతానికి అన్ని ప్రశ్నలే గానీ, అంచనాలను దాటి జరుగుతున్న ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమా బిజినెస్, తెలుగు సినిమాను మరింత ఎత్తుకు ఎదిగేలా చేయాలని, అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ లకు నాలుగు రూపాయలు రావాలని మాత్రం ఆశిద్దాం. అయితే డబ్బులు వచ్చే చోట ఎంత పెట్టడానికైనా వెనుకాడని దిల్ రాజు, ఈ రెండవ పార్ట్ హక్కులను ఎందుకు దక్కించుకోనట్టు? దీని వెనుక ఉన్న ‘దిల్’ రాజు గారి లెక్కలేంటి..? రిస్క్ అనుకున్నారా..? 2017, ఏప్రిల్ 28వ తేదీన సమాధానం లభించవచ్చు.