Baahubali 2 - UAE Censor Report“బాహుబలి-2” సినిమా ఆద్యంతం అత్యద్భుతం… అంటూ యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమెయిర్ సంధు ఆకాశానికెత్తేశాడు. సినిమా మొత్తం అదిరింది… సినిమాలో ఒక్క డల్ మూమెంట్ కూడా లేదని తేల్చి చెప్పాడు. హ్యాట్సాఫ్ టు ప్రభాస్ అంటూ అమరేంద్ర బాహుబలిని ప్రశంసించాడు. ఇండియాకు సంబంధించిన సినిమాల్లో ఇంత గొప్ప సినిమాను తాను చూడలేదని… ఈ శుక్రవారం నాడు చరిత్ర తిరగ రాయబడుతుందని… ఇండియాస్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ కొనియాడాడు.

భారతీయ సినీ చరిత్రలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినందుకు, సినీ పరిశ్రమను మరింత ఎత్తుకు తీసుకెళ్లినందుకు దర్శకధీరుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు ప్రశంసలను “బాహుబలి-2” అందుకుందని, కాసేపటి క్రితం యూఏఈ సెన్సార్ బోర్డు ఈ సినిమాను చూసిందని, అందరూ నిల్చుని చప్పట్లు కొట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమెయిర్ ఈ సినిమా ఎలా ఉందో అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ట్వీట్ల రూపంలో తెలియజేస్తూ… సినిమాకు ‘ఫైవ్ స్టార్’ రేటింగ్ ఇచ్చాడు.

అయితే గతంలో ఉమైర్ సందు పలు కమర్షియల్ సినిమాలకు కూడా ఇదే తరహాలో ఆకాశానికేత్తేయడం… ఫోర్ స్టార్ రేటింగ్స్ ఇవ్వడం… వంటి విషయాలు నెటిజన్లకు తెలిసినవే. దీంతో ‘బాహుబలి 2’పై సందు అభిప్రాయం అభిమానులకు సంతోషాన్ని పంచుతున్నప్పటికీ, విశ్వాసం మాత్రం కలిగించలేకపోతోంది. ఈ ఏడాది విడుదలైన ‘కాటమరాయుడు’ సినిమా విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేయగా, చివరికి అది బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. అందుకే సినిమా ఫస్ట్ షో పడే వరకు ఇలాంటి అభిప్రాయాలను తలకెక్కించుకోకుండా ఉంటే మంచిదన్న భావన నెటిజన్లు వ్యక్తపరుస్తున్నారు.