Baahubali-2 Tickets as dowryమరో మూడు రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వబోతున్న “బాహుబలి 2 – ది కన్ క్లూజన్” ఫీవర్ మామూలుగా లేదన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పోలీసులు కూడా అఫిషియల్ గా సెలవులు పెట్టుకుంటున్న వైనం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 28వ తేదీన సెలవు కోరుతూ ఓ కానిస్టేబుల్ రాసిన ‘లీవ్ లెటర్’ వాట్సప్ లలో సందడి చేస్తుండగా, తాజాగా ఓ కార్టూనిస్ట్ ‘బహుబలి 2’ టికెట్లకున్న ప్రాధాన్యత ఏమిటో తెలియచెప్పాడు.

వర్తమాన సామాజిక అంశాలపై వ్యంగ్యంగా వర్ణించడం కార్టూనిస్ట్ ల ప్రతిభ. అందులో భాగంగానే ఓ వ్యక్తి తన కొడుకుకు పెళ్లి సంబంధం ఫిక్స్ అయ్యిందని, వరకట్నంగా పది లక్షల నగదు, పదిహేను తులాల బంగారం మరియు 20 ‘బాహుబలి 2’ టికెట్లను ఫైనల్ చేసాం అని మరో వ్యక్తికి చెప్తుంటాడు. క్యాష్, గోల్డ్ అనేవి పెళ్ళిలో చాలా విలువైన అంశాలు. అలాంటి వాటి సరసన ‘బాహుబలి 2’ టికెట్లు కూడా చేర్చారంటే… ప్రస్తుతం ‘బాహుబలి 2’ ఒక్కో టికెట్ ధర ఏ మాత్రం పలుకుతుందో అర్ధం చేసుకోవచ్చు.

అలాగే ‘బాహుబలి 2’ టికెట్లను వరకట్నంగా ఒప్పుకున్నారంటే… ఈ సినిమాపై ఏ మాత్రం క్రేజ్ ఉందో సదరు కార్టూనిస్ట్ చెప్పకనే చెప్పాడు. ఇలా ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా… ‘బాహుబలి 2’ టికెట్ల ధరలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ… మరో వైపు ఈ సినిమాకున్న క్రేజ్ ఏంటో చెప్పకనే చెప్పాడు. అడ్వాన్సు బుకింగ్స్ లో సరికొత్త చరిత్రను లిఖిస్తోన్న ఈ సినిమా టికెట్ల డిమాండ్ సాధారణంగా లేదు. ఏపీలో రోజుకు రెండు, తెలంగాణాలో ఒక షో పెంచినా గానీ, సరిపోవడం లేదంటే ఏ రేంజ్ లో ‘బాహుబలి 2’ మేనియా ఊపేస్తుందో అవగతమవుతోంది.