Baahubali 2-the-conclusion USA Collectionsయుఎస్ బాక్సాఫీస్ పైన ఇండియా జెండా రెపరెపలాడేలా చేయడంలో “బాహుబలి 2” టీం సక్సెస్ సాధించింది. గురువారం నాడు ప్రదర్శితమైన ప్రీమియర్ షోలతో కలుపుకుని, యుఎస్ మార్కెట్ లో తొలి మూడు రోజుల్లో ఏకంగా 10 మిలియన్ డాలర్స్ ను వసూళ్లు చేసి, ఆల్ టైం జాబితాలో నెంబర్ 1 స్థానం చేరుకోవడానికి కొద్ది దూరంలో నిలిచింది. అయితే ‘బాహుబలి 2’ ఈ ఘనత సాధించడం వెనుక టికెట్ ధరలను పెంచడం ప్రధాన కారణమన్నది బహిరంగ సత్యమే.

సాధారణంగా 10 నుండి 20 డాలర్లు మాత్రమే ఉండే టికెట్ ధరలను ‘బాహుబలి 2’ కోసం కనీస టికెట్ ధర 30 డాలర్లకు పెంచారు. దీంతో యుఎస్ లో దీని పైన చాలా నెగిటివ్ ప్రచారమే జరిగింది. ఒక కుటుంబం సినిమా చూడడానికి 60-70 డాలర్ల మధ్యలో ఖర్చయ్యేది కాస్త, ఇపుడు 150 డాలర్లకు చేరుకోవడంతో… అమాంతంగా టికెట్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ… ఈ సినిమాను చూడొద్దని యుఎస్ లోని వాట్సప్ గ్రూప్ లలో భారీగా ప్రచారం జరిగింది. అయితే రాజమౌళి ‘బ్రాండ్’ ముందు, ‘బాహుబలి’ క్రేజ్ ముందు ఇవేమీ పనిచేయలేదు.

కట్ చేస్తే… గురువారం నుండి ఆదివారం నాటికి బాక్సాఫీస్ వద్ద 10 మిలియన్ డాలర్స్ వచ్చిపడ్డాయి. ఇక్కడ యుఎస్ డిస్ట్రిబ్యూటర్ వేసిన పక్కా ప్రణాళిక కూడా బాగా వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. కనీస ధరగా మామూలు ధియేటర్ లో 30 డాలర్లుగా ఉన్న టికెట్ ధరను, ‘XD’ టెక్నాలజీకి వచ్చేసరికి 33+ డాలర్లుగా, అలాగే ‘ఐమాక్స్’ స్క్రీన్ పైన చూడడానికి 45 డాలర్లుగా నిర్ణయించారు. ఈ ప్రభావంతో ఆల్ టైం జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న ‘దంగల్’ (12 మిలియన్ డాలర్స్)కు అతికొద్ది దూరంలో మాత్రమే ‘బాహుబలి 2’ నిలిచింది.

వచ్చే వీకెండ్ నాటికి ‘దంగల్’ను అధిగమించడం అన్నది నామమాత్రపు విషయమే కాగా, ఆ పైన ఎంతవరకు కొల్లగొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ట్రేడ్ వర్గాల తాజా అంచనా ప్రకారం ఓవరాల్ గా యుఎస్ బాక్సాఫీస్ నుండి 15-17 మిలియన్ డాలర్స్ వరకు రాబడుతుందని టాక్. దీంతో సినిమా విడుదలకు ముందు, ‘బాహుబలి 2’ని చూడొద్దని ఓ వర్గం పని కట్టుకుని చేసిన ప్రచారానికి అసలు విలువ లేకుండా పోయిందని స్పష్టమైంది… అలాగే ‘బాహుబలి’ మేనియా ముందు ఎలాంటి పప్పులుడవన్న విషయం అర్ధమైంది.