Baahubali-2-the-conclusion Tamil Leakవర్తమానం నుండి కాస్త ఫ్లాష్ బ్యాక్ కు వెళితే… “బాహుబలి 2” ధియేటిరికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు అంతా ఎదురుచూస్తున్న సమయం… కట్ చేస్తే… ఇంతలోనే సోషల్ మీడియాలో తమిళ వర్షన్ కు సంబంధించిన ట్రైలర్ ప్రత్యక్షమయ్యింది. దీంతో అవాక్కైన చిత్ర యూనిట్, మొత్తం నాలుగు భాషలకు సంబంధించిన ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేసారు. ట్రైలర్ కాబట్టి డ్యామేజ్ తక్కువే జరిగింది, అందులోనూ ట్రైలర్ మెస్మరైజింగ్ గా ఉండడంతో, లీకేజ్ వ్యవహారం మరుగున పడిపోయి, యూ ట్యూబ్ రికార్డుల లెక్కలు చూసుకునే పనిలో పడిపోయారు.

ఇక ప్రస్తుత పరిస్థితి వస్తే… భారీ అంచనాలు నెలకొన్న ‘బాహుబలి 2’ ధియేటర్లలో ప్రత్యక్షం కావడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ లోపున ‘బాహుబలి 2’ యొక్క తమిళ వర్షన్ కు చెందిన కొన్ని సీన్లు లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం కలవర పెడుతోంది. అయితే ఇవి ఉద్దేశపూర్వకంగా బయటకు వచ్చాయా? లేక పైరసీ వ్యవహారాలలో భాగంగా వచ్చాయా? అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ, సినిమా విడుదల కాకముందే పైరసీ సాధ్యం కాదు గనుక, లీకేజ్ లో భాగంగానే వీటిని సోషల్ మీడియాలోకి వదిలినట్లుగా భావించాల్సి ఉంటుంది.

అయితే లీక్ అయిన ఈ కొన్ని సన్నివేశాల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు గానీ, సినిమా విడుదలయ్యే సమయానికి మొత్తం ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయితే గనుక డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. విజువల్ వండర్ గా నిలిచే ఇలాంటి సినిమాలను పైరసీలో చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకుల సంఖ్య తక్కువగానే ఉంటుందని భావించినప్పటికీ, ఇలా పైరసీ వస్తే గనుక సినిమాపై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దీంతో ఈ లీకేజ్ మరియు పైరసీపై ‘బాహుబలి 2’ ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే అప్పుడు ట్రైలర్, ఇప్పుడు సినిమా సీన్లు… రెండూ తమిళ వర్షన్ వే ఎలా లీక్ అయ్యాయి?