ది వెయిట్ ఈజ్ ఓవర్… రెండేళ్ళ నుండి దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ప్రశ్నకు సమాధానం లభించింది… ఇక తమ అభిమాన హీరో విశ్వరూపం చూడాలని భావించిన ‘యంగ్ రెబల్ స్టార్’ అభిమానుల పంట పండింది… ఇలా ఒకటేమిటి… బాహుబలి 2లో ప్రతిదీ ఒక అద్భుతం అనే విధంగా ‘దర్శకధీరుడు’ రాజమౌళి దేశం మీసం తిప్పి తెలుగు వాడి ప్రతిభ ఏమిటో చాటిచెప్పాడు. అవును… ప్రస్తుతం సినీ ప్రపంచమంతా రాజమౌళి గురించే మాట్లాడుకుంటోంది.

ప్రతి సినిమాలోనూ లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ‘బాహుబలి 2’లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని ఇప్పటికే సినీ విమర్శకులు తేల్చేసారు. అయితే ఆ లోపాలను మించిపోయే విధంగా సినిమా గురించి ఈనాడు మాట్లాడుకుంటున్నారంటే… అది రాజమౌళి అద్భుత సృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ సినిమా ధియేటర్ నుండి బయటకు వస్తున్న ప్రేక్షకుల నుండి వినిపిస్తున్న ఏకైక మాట… ఇండియాలో మొదటి వెయ్యి కోట్ల కలెక్షన్లు వసూలు చేసే సినిమా… ఇది రాసుకోండి… పక్కా… అంటున్నారు.

అంతలా సినీ ప్రేక్షకులను సమ్మోహితులను చేయడంలో రాజమౌళి సక్సెస్ సాధించాడు. ప్రీమియర్ అండ్ బెనిఫిట్ షోల నుండి వెలువడిన ఈ టాక్ సోషల్ మీడియా వేదికగా ప్రపంచమంతా పాకడంతో, ఈ సినిమా టికెట్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారైతే ఫోన్లకు సైతం జవాబు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మధుర శ్రీధర్ వంటి వారు నేరుగా సోషల్ మీడియాలోనే చెప్పేస్తున్నారు. ఇదంతా రాజమౌళి సృష్టించిన మాహిష్మతి నగర సామ్రాజ్యం ప్రభావం.

‘బాహుబలి 2’ సక్సెస్ లో అగ్ర తాంబూలం రాజమౌళికి దక్కితే, ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ ను ‘వన్ మ్యాన్ షో’గా మార్చేసిన ఘనత ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ కి దక్కింది. సినిమానంతా తన భుజస్కందాలపై వేసుకున్న ప్రభాస్, దీంతో ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎదగడం ఖాయంగా చెప్పవచ్చు. అలాగే రమ్యకృష్ణ, అనుష్క, రానా, సత్యరాజ్ లు తమ తమ అభినయాలతో ప్రేక్షకులను కట్టిపడేసారు. తెలుగు వాడి సత్తాకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన “బాహుబలి 2” విజయానికి ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెప్దాం..!