Baahubali2 The Conclusion Screening Theatresఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై “బాహుబలి 2” ద్వారా సరికొత్త రికార్డులను చవిచూడడానికి సినీ ప్రేక్షకులు మానసికంగా సిద్ధమైపోయారు. ఆ మాటకొస్తే ఒక్క ప్రేక్షకులే కాదు, ఇండస్ట్రీ జనాలు కూడా ‘బాహుబలి 2’ ప్రభంజనం గురించి బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ అంచనాలను మించిపోయే విధంగా ఉండడంతో, ఈ సినిమా సృష్టించబోయే రికార్డులపై మరింతగా నమ్మకం పెరిగింది.

ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7500 ధియేటర్లలో “బాహుబలి 2” హవా కొనసాగనుందని ట్రేడ్ వర్గాల తాజా సమాచారం. ఒక్క ఇండియాలోనే 6500 ధియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, ఓవర్సీస్ లో 1000 ధియేటర్లలో “బాహుబలి 2”ను ప్రదర్శించడానికి ముస్తాబు జరుగుతోంది. ఇది కేవలం ప్రస్తుతం ఉన్న సంఖ్య మాత్రమే. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల పాటు సమయం ఉండడంతో ఈ సంఖ్య పెరగడం ఖాయం అంటున్నారు సినీ వర్గీయులు.

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక ధియేటర్లలో ప్రదర్శితమయ్యే సినిమాగా “బాహుబలి 2” సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనపడుతోంది. అయితే ఇవన్నీ ప్రీ రిలీజ్ రికార్డులు. ఒక్కసారి విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తొలి రోజే 100 నుండి 150 కోట్లు అవలీలగా అందుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ కూడా ‘బాహుబలి 2’ నెత్తికెత్తుకోవడంతో రికార్డుల అంచనాలు తప్పయ్యే అవకాశమే లేదన్నది మరో టాక్.