“బాహుబలి – ది కన్‌క్లూజన్‌” సినిమా టికెట్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో కొలువై ఉన్న పలు మల్టీప్లెక్స్‌ లు సరికొత్త దందాకు తెరలేపినట్లుగా సమాచారం. ప్రేక్షకుల జేబులు గుల్ల చేయడమే లక్ష్యంగా… కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ ల పేరిట సరికొత్త సినీ అభిమానులకు చుక్కలు చూపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.

ప్రేక్షకుల అభిరుచులతో సంబంధం లేకుండా కూల్‌ డ్రింక్, పాప్‌కార్న్ వంటి తినుబండారాలను ‘కాంబో ఆఫర్’ పేరుతో ప్రతి టికెట్ పై ఖచ్చితంగా కొనుగోలు చేసే విధంగా స్కెచ్ లు వేసాయి. ఈ ఆఫర్ల పేరుతో టికెట్ ధరను ఏకంగా 75 శాతం పెంచే ఈ స్కీంలో దళారులు, మల్టీప్లెక్స్ నిర్వాహకులు భాగస్వామ్యులు అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు మొదటి మూడు రోజుల పాటు కార్పొరేట్ షోల పేరుతో మల్టీప్లెక్స్‌ లలో టికెట్లన్నీ బల్క్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇందుకోసం మల్టీప్లెక్స్ నిర్వాహకుల నుంచి ఫుడ్ కూపన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అంటే టికెట్ ధర 150 అయితే కాంబో ఆఫర్ పేరుతో దానిని 250 నుంచి 300 వరకు విక్రయిస్తున్నారు. తద్వారా ఒక్క షో ద్వారానే లక్షలాది రూపాయలు పిండుకుంటున్నారు. ఇక ఒక్కో టికెట్‌ను 450 పెట్టి కొంటున్న దళారులు వాటిని ఎంట్రీ పాస్‌ ల రూపంలో ప్రింట్ చేస్తున్నారు. వాటిపై వివిధ సంస్థల ప్రకటనలను ముద్రించి లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఈ పాస్‌ లను 1000 వరకు అమ్ముకుంటున్నట్టు చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్‌ ల దందా, ఇతర ప్రాంతాలకు పాకక ముందే దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.