Baahubali 2 the conclusion Karnataka releasing Theaters‘బాహుబలి-2’ సినిమా కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరోవైపు కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ వివాదంతో… కర్ణాటకలో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆడనివ్వమంటూ అక్కడి కన్నడ సంఘాలు తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే సత్యరాజ్ కూడా కన్నడిగులకు క్షమాపణలు చెప్పడంతో ఆందోళనకారులు మెత్తబడి, సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కన్నడ ప్రేక్షకులు ఖుషీ అయ్యారు.

మొన్నటి వరకు కర్ణాటకలో ఈ సినిమా విడుదలవుతుదో? లేదో? అనే సందేహం తలెత్తగా… ఇప్పుడు ఇదే సినిమా అక్కడ రికార్డుల మోత మోగించేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటక వ్యాప్తంగా ఏకంగా 700 థియేటర్లలో ‘బాహుబలి 2’ సినిమాను ఏక కాలంలో పదర్శించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. కన్నడ సినీ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని రికార్డ్ కావడం గమనార్హం. దీంతో కన్నడ నాట కూడా రికార్డు ఓపెనింగ్స్ ఖాయమన్న విషయం ఇప్పటికే ఖరారైంది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్ల గురించి అంచనాలు వేసే పనిలో పడ్డారు ట్రేడ్ పండితులు.

ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం కూడా ఏపీ తెలంగాణాల బాటలోనే ‘బాహుబలి 2’కు అనుకూలంగా టికెట్ ధర పెంపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నేడు జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించి, నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. టికెట్ కనీస ధరను 200గా నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం. 2 నిమిషాల లోపు నిడివి గల కన్నడ టీజర్ ను ఇప్పటివరకు 60 లక్షల మంది వీక్షించడంతో, కన్నడనాట ‘బాహుబలి 2’ క్రేజ్ ఏ పాటిదో చెప్పకనే చెబుతున్నారు.