Baahubali 2 the conclusion Censor Talkక్రేజీ సినిమాలకు సంబంధించిన సమాచారం అంతా ఎక్కడో ఓ చోట లీక్ అవుతూనే ఉంటుంది. అందులో భాగంగానే ‘బాహుబలి 2’ యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన పలు సీన్లు గతంలో లీక్ కాగా, అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి లీక్ లకు గురి కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది. అలాగే సెన్సార్ పూర్తయిన వెంటనే, సోషల్ మీడియా ద్వారా ‘సెన్సార్ టాక్’ పేరుతో సినిమా ఫేట్ ను డిసైడ్ చేయడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది.

ముఖ్యంగా ట్విట్టర్ లో ఈ ‘సెన్సార్ రిపోర్ట్స్’ ఎక్కువగా హల్చల్ చేస్తుండగా, అందులో భాగంగానే ‘బాహుబలి 2’కు సంబంధించి కూడా సెన్సార్ టాక్ హల్చల్ చేస్తోంది. బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ సొంతం చేసుకున్న ‘బాహుబలి 2,’ ఇండియన్ సినీ పరిశ్రమ గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుందని, ప్రభాస్ – అనుష్కల మధ్య వచ్చే ఎపోసోడ్ మరియు యుద్ధ సన్నివేశాలలోని కొన్ని కీలక షాట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని సమాచారం.

అయితే ఇతర సినిమాల విషయాలలో ఈ ‘సెన్సార్ టాక్’ ప్రభావం ఎంతో కొంత పడుతుందేమో గానీ, ‘బాహుబలి 2’ విషయంలో మాత్రం ఇలాంటి ‘ప్రీ రిలీజ్ టాక్’లకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవచ్చు. ఎందుకంటే, ప్రతి సినీ ప్రేక్షకుడు ఈ సినిమాను చూసేయాలని మానసికంగా ఫిక్స్ అయిపోవడంతో, ‘సెన్సార్ టాక్’కు పెద్దగా విలువ లేకుండా పోయింది. సరిగ్గా మరో పది రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పై నాలుగు భాషల్లో ‘బాహుబలి 2’ బొమ్మ పడబోతోంది… ధియేటర్లు దద్దరిల్లబోతున్నాయనేది స్పష్టం..!