Baahubali 2 Sivagami Devi - TV AD Commercial‘బాహుబలి’ సినిమాకున్న క్రేజ్ ను ఒక్కొక్కరు ఎలా వాడుతున్నారో అందిరికీ తెలిసిన విషయమే. కొంతమంది అయితే ఏకంగా ఓ ఫేక్ వెబ్ సైట్ ను సృష్టించి, దాని ద్వారా డబ్బులు సంపాదించగా, సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లలో ‘బాహుబలి’ సినిమా లీకుల పేరుతో హల్చల్ చేస్తున్న వీడియోలకు కొదవలేదు. ఇందులో భాగంగానే ‘బాహుబలి 2’ ఇంటర్వెల్ పార్ట్ లీక్ అయ్యిందంటూ యూ ట్యూబ్ లో ఓ వీడియో సందడి చేస్తోంది.

అయితే ఎంతో ఆసక్తితో క్లిక్ చేసిన ఈ వీడియోను చూసిన వారు ముందుగా నవ్వుకుంటున్నారు. మరి అంతలా నవ్వించేది ‘బాహుబలి’లో ఏముంది? అనుకుంటున్నారా? ‘బాహుబలి’లో ఏమీ లేదు గానీ, ఆ సినిమాను వినియోగించుకుంటూ రూపొందించిన వీడియోలో మాత్రం ఉందని చెప్పవచ్చు. ‘బాహుబలి పార్ట్ 1’లో ఉన్న రమ్యకృష్ణ సన్నివేశాలను ఎరువుల యాడ్ కు వాడుకుంటూ కట్ చేసిన ఈ వీడియో నెటిజన్లలో కామెడీని పండిస్తోంది.

నిజానికి ఈ వీడియో గత పది రోజుల క్రితమే పోస్ట్ చేయగా, సినిమా విడుదల సమయం దగ్గర పడడంతో ఇది మరింతగా వైరల్ గా మారింది. ‘బాహుబలి’ క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తున్న ఈ వీడియోకు కూడా వేల సంఖ్యలో క్లిక్స్ రావడం విశేషం. సినిమా విడుదలకు ముందు పరిస్థితి ఇలా ఉంటే, విడుదలైన తర్వాత ఇంకెన్ని వీడియోలు పుట్టుకొస్తాయో చూడాలి.