baahubali-2-piracy-rajamouli-anchor-sumaఎన్ని కఠిన నియమాలు పెట్టినా… ఎంత జాగ్రత్తగా షూటింగ్ నిర్వహించినా… ‘బాహుబలి’ సినిమాకు లీకేజ్ లు తప్పలేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్న ‘బాహుబలి 2’కు సంబంధించి, ఓ వీడియో క్లిప్ లీకైన విషయం తెలిసిందే. అయితే దీనిని నియత్రించేందుకు రాజమౌళి తాజాగా హెచ్చరికలు జారీ చేసారు. ‘బాహుబలి’ని పైరసీ చేస్తే ఏకంగా జైలుకు వెళ్ళాల్సిందే… అనే విధంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించి పైరసీ దారులకు ఛాలెంజ్ విసిరారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం నాడు ఆ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన యాంకర్ సుమ… ఓ సెల్ఫీ తీసుకుంది. అయితే ఇక్కడ ఏ ఒక్కరు సెల్ఫీ తీసుకోకూడదని… ఒక్క ఫొటో కూడా బయటకు వెళ్లకూడదనేది రాజమౌళి ఆర్డర్. దీనిని అతిక్రమించిన యాంకర్ సుమను వెంటనే దేవసేన కోసం తయారు చేసిన జైల్లో పెట్టారు. ఆ తర్వాత తనను విడిపించమంటూ సుమ మొరపెట్టుకున్నా ఎవరూ రాలేదు.

ఆ సమయంలో స్వయంగా రాజమౌళే అక్కడకు వచ్చాడు. అయితే ‘తన సినిమా ఆడియో ఫంక్షన్ కు డబ్బులు తీసుకోకుండా హోస్ట్ చేస్తేనే, సుమను జైలు నుంచి బయటకు తీసుకొస్తానని’ రాజమౌళి షరతు విధించాడు. దానికి సుమ ఓకే చెప్పడంతో వెంటనే బయటకు వచ్చింది. ఆ తర్వాత రాజమౌళిని సుమ ఇంటర్వ్యూ చేసింది. అయితే, ఇదంతా నిజంగానే జరిగింది అనుకునేరు. ఇదంతా కేవలం సినిమా ప్రమోషన్ లో భాగంగా వెరైటీగా ప్లాన్ చేసిన ప్రోగ్రాం. కాస్త వెరైటీగా ఉన్నా… దీని ద్వారా రాజమౌళి సరైన సందేశాలనే పంపారని క్రియేటివ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.