Baahubali 2 Overseas collectionsఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాజమౌళి చెక్కిన “బాహుబలి 2” ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 1600 కోట్లకు చేరువలో ఉన్న ‘బాహుబలి 2,’ ఈ క్రమంలో మరో ‘ల్యాండ్ మార్క్’ను అందుకుంది. సినిమా విడుదలకు ముందు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను కొల్లగొడుతుందని భావిస్తే, 27 రోజుల తర్వాత ఏకంగా 1000 కోట్ల నెట్ కలెక్షన్స్ ను అందిపుచ్చుకుని, ‘బాహుబలి’ బ్రాండ్ రేంజ్ ఏమిటో చాటిచెప్పింది.

ఇందులో ఎక్కువ శాతం బాలీవుడ్ మార్కెట్ నుండి 485 కోట్లు వసూలు కాగా, మిగతా బాధ్యతలను దక్షిణాది రాష్ట్రాలు తీసుకున్నాయి. తెలుగు నాట ‘బాహుబలి 2’ సినిమాను టచ్ చేయడానికి కూడా అవకాశం లేనంత రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 260 కోట్లు పైనే వసూలు చేసిందని సమాచారం. అలాగే తమిళనాడులో 100 కోట్లు దాటగా, కర్ణాటకలో 100 కోట్లకు చేరువలో ఉందని, కేరళలో 50 కోట్లు దాటిందని సమాచారం.

మొత్తంగా 27 రోజులకు గాను 1007 కోట్ల నెట్ కాగా, గ్రాస్ విషయానికి వస్తే 1596 కోట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం గ్రాస్ లో ఇండియాలో 1299 కోట్లు, ఓవర్సీస్ లో 297 కోట్లు ‘బాహుబలి 2’ ఖాతాలో పడినట్లుగా ట్రేడ్ సమాచారం. అతి త్వరలోనే చైనాలో కూడా విడుదల అవుతుందన్న సమాచారంతో, 2000 కోట్లను ‘బాహుబలి 2’ అవలీలగా అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.