‘దర్శకధీరుడు’ రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి-2” సినిమా విడుదలకు ముందే భల్లాలదేవుడు రానా మెడపై కత్తిపెట్టి బాహుబలి ప్రభాస్, దేవసేన అనుష్క సరదాగా ప్రతీకారం తీర్చుకున్నారు. ముంబయిలో నిర్వహించిన వరల్డ్ బాహుబలి ఈవెంట్ లో ఈ దృశ్యం చోటు చేసుకుంది. వేదిక పైకి కత్తులతో ప్రవేశించిన ప్రభాస్, అనుష్కలు అక్కడే ఉన్న బల్లాల దేవుడు రానాకి ఇరువైపులా నించొని, ఆయన గొంతుపై కత్తులుపెట్టారు.
సరదాగా చేసిన ఈ ఫోటోను బాహబలి టీమ్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా కేరళలో 300 థియేటర్లకు పైగా విడుదల కాబోతుందని, అక్కడి 100కు పైగా థియేటర్లలో ఉదయం 6 గంటల షో కూడా ఉంటుందని చెప్పింది. ఈ సినిమాను ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘బాహుబలి-2’ ప్రచార కార్యక్రమాల్లో సినిమా యూనిట్ జోరుగా పాల్గొంటోంది.