Baahubali 2 Movie net collectionsవిడుదలైన రెండు వారాలు పూర్తి కావస్తున్నా బాక్సాఫీస్ వద్ద “బాహుబలి 2” జోరు ఆగడం లేదు. సాధారణంగా అదిరిపోయే ఓపెనింగ్స్ తర్వాత ఏ సినిమాకైనా గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. కానీ, ‘బాహుబలి 2’ విషయంలో మాత్రం తొలి వారం ఇందుకు విరుద్ధంగా జరుగగా, మలి వారంలో గ్రాఫ్ తగ్గినప్పటికీ, అది అంచనాలు వేసిన దాని కంటే చాలా తక్కువగా డౌన్ కావడంతో, రికార్డులు దాసోహం అనక తప్పడం లేదు.

ఇప్పటికే ఆల్ టైం ఇండియన్ సినిమాగా రికార్డులను సొంతం చేసుకున్న “బాహుబలి 2,” తాజాగా ఆల్ టైం బాలీవుడ్ సినిమాల జాబితాలో కూడా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అంతకుముందు అమీర్ ఖాన్ “దంగల్” పేరిట ఉన్న 387.38 కోట్ల రికార్డును అధిగమిస్తూ… 400 కోట్ల నెట్ కలెక్షన్స్ ను టచ్ చేసింది. ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా ఖ్యాతి గడించిన జక్కన్న చెక్కిన సినిమా, 500 కోట్ల క్లబ్ ను కూడా టచ్ చేస్తుందా?

అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లభించకపోవచ్చు గానీ, ఈ వీకెండ్ ముగిసే నాటికి ఖచ్చితంగా ఓ జవాబు అయితే రావడం తధ్యం అంటున్నారు సినీ వర్గీయులు. ఈ వీకెండ్ లో కూడా కలెక్షన్ల దూకుడును కొనసాగిస్తే, బాలీవుడ్ లో సరికొత్త చరిత్రను సృష్టించడమే కాదు, మళ్ళీ ‘బాహుబలి 2’ని అందుకోవాలంటే ఖాన్ త్రయానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది? అన్నది కూడా కీలకం కానుంది.

ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్న మన తెలుగు సినిమా స్థానికంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ‘బాహుబలి 1’ రికార్డులను అధిగమించి, టాప్ చైర్ లో కూర్చుంది. అలాగే యుఎస్ లో కూడా 17 మిలియన్ డాలర్స్ కు చేరువ కాగా, మ్యాజిక్ ఫిగర్ గా భావిస్తున్న 20 మిలియన్ డాలర్స్ ను అందుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యంగానే కనపడుతోంది. అయితే రాజమౌళి బ్రాండ్… ఏదైనా సాధ్యం… అన్న టాక్ కూడా ఉంది.