సాధ్యం అవుతుందో లేదో అనుకున్న చారిత్రాత్మక ఘట్టానికి ‘బాహుబలి 2’ తెరలేపింది. ఇండియన్ సినీ పరిశ్రమ గర్వపడేలా తొలి 1000 కోట్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ‘బాహుబలి 2’ పేరు సువర్ణాక్షరాలతో లిఖించే ఉంటుంది. అయితే ఇప్పుడు మ్యాటర్ సాధించేసిన 1000 కోట్లు కాదు, అంతకుమించి..! అవును… కనివిని ఎరుగని విధంగా నమోదవుతున్న ‘బాహుబలి 2’ రేంజ్ ఎంతన్నది ట్రేడ్ పండితులకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

తొలి రోజు ధియేటర్ల వద్ద నెలకొన్న సందడి వాతావరణమే పదవ రోజు కూడా ఉందంటే ఏ స్థాయిలో జననీరాజనం పడుతున్నారో అవగతమవుతోంది. బహుశా ఈ సందర్భంగా సూర్యదేవుడు కూడా శాంతించాలి అని భావించాడో ఏమో గానీ, ఆదివారం నాడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడి, తొలకరి చినుకులతో వరుణ దేవుడు కూడా ‘బాహుబలి 2’ సందడిని ప్రత్యక్షంగా తిలకించాడు. సినీ ప్రేమికులంతా ఎదురుచూసిన ఘట్టం ముగిసింది. మరి నెక్స్ట్ ఏంటి?

‘బాహుబలి 2’ రేంజ్ 2000 కోట్లా? 1500 కోట్లా? ఎంత… ఇంకెంత..? అనే లెక్కలలో ట్రేడ్ వర్గీయులు మునిగి తేలుతున్నారు. అయితే ప్రస్తుత ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 1400-1600 కోట్ల నడుమ ఫైనల్ కలెక్షన్స్ ఉండవచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, ఆ ఉధృతి ఇంకా ఎక్కువైనా ఆశ్చర్యపడాల్సిన పని లేదని చెప్తున్నారు. అంచనాలకు అందని విధంగా తొలి 10 రోజుల్లోనే 1000 కోట్లు కొల్లగొట్టిన ‘బాహుబలి 2’ మొదటి 30 రోజులు ముగిసే సమయానికి ఖచ్చితంగా మరో నాలుగైదు వందల కోట్లు వసూళ్లు చేస్తుందని భావిస్తున్నారు.

దీంతో ‘బాహుబలి 2’ కలెక్షన్స్ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ బెట్టింగ్స్ మాదిరిగా మారిపోయాయి. ఐపీఎల్ మ్యాచ్ లలో ఒక జట్టు ఎంత స్కోర్ సాధిస్తుందని జరిగే జరిగే బెట్టింగ్స్ మాదిరి, ఇక్కడ ‘బాహుబలి 2’ కలెక్షన్స్ పై కూడా భారీ బెట్టింగ్స్ జరుగుతున్నాయని చెప్పే విధంగా పరిస్థితి కొనసాగుతోంది. ఇక యుఎస్ లో మార్కెట్ లోనూ ‘బాహుబలి 2’ ప్రభంజనం ఇంకా తగ్గలేదు. ఇప్పటికే దాదాపుగా 15 మిలియన్ సంఖ్యకు చేరుకున్న ఈ హంగామా, 20 మిలియన్స్ కు చేరుకొని మరో చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.