baahubali-2-leakage-culprit-graphic-designer-krishna-in-vijayawadaఆన్ లైన్ లో ప్రత్యక్షమైన “బాహుబలి 2” పోరాట సన్నివేశాలపై కలకలం చెందిన చిత్ర బృందం అనుమానితుడిగా భావించిన గ్రాఫిక్ డిజైనర్ కృష్ణపై చిత్ర బృందం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలలో భాగంగా కృష్ణను విజయవాడలో అరెస్ట్ చేసారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకున్న కృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో “బాహుబలి 2”కు సంబంధించిన ఎడిటింగ్ విభాగంలో కృష్ణ పనిచేస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా 9 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తస్కరించాడని చిత్ర బృందం పసిగట్టింది. అయితే ఆన్ లైన్ లో 2 నిముషాల నిడివి మాత్రమే ఉండడం చిత్ర బృందానికి ఊరటనిచ్చే అంశం. మొత్తానికి ఈ ‘ఇంటి దొంగ’ను వెంటనే కనిపెట్టడంలో అటు చిత్ర బృందానికి తోడు పోలీసులు కూడా సఫలీకృతమయ్యారు.

భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిమిత్తం తదుపరి మూడు నెలల సమయాన్ని కేటాయించనున్నారు. ఈ సినిమాలో అనుష్క పాత్ర ఎక్కువగా ఉంటుందని, తమన్నాతో ఒక్క పాట కూడా ఉండదని, ప్రభాస్ – రానాల మధ్య పోరాట సన్నివేశాలు హైలైట్ కానున్నాయని జక్కన్న ఇప్పటికే స్పష్టం చేసారు.