baahubali-2-first-look-poster-disappointedఅభిమానుల్లో, సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్న సినిమాలు, వాటిని అందుకోవడం దాదాపుగా అసాధ్యంగానే భావించవచ్చు. ఏవో ఒకటి, రెండు సందర్భాలు వీటికి విరుద్ధంగా జరుగుతాయి గానీ, ఎక్కువ సమయాల్లో ఆ భారీ అంచనాలను చిత్ర యూనిట్ అందుకోలేదు. తాజాగా విడుదలైన “బాహుబలి 2” ఫస్ట్ లుక్ కూడా ఈ కోవలోకే చెందుతోంది.

ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన ‘బాహుబలి 2’ ఫస్ట్ లుక్ యంగ్ రెబల్ స్టార్ అభిమానుల మద్దతు పొందిందేమో గానీ, ఓవరాల్ గా విమర్శల పాలయ్యింది. ప్రభాస్ లుక్ పరంగా బాగానే ఉన్నప్పటికీ, పోస్టర్ డిజైన్ అంచనాలను అందుకోకపోగా, ఓ బి గ్రేడ్ స్థాయిలో బ్యాక్ గ్రౌండ్ గ్రాఫిక్స్, పోస్టర్ డిజైన్ ఉందన్న విమర్శలను మూట కట్టుకుంది. బహుశా ఈ వ్యాఖ్యలను ప్రభాస్ అభిమాని సీరియస్ గా తీసుకున్నారేమో గానీ, రాజమౌళి విడుదల చేసిన ఫస్ట్ లుక్ బ్యాక్ గ్రౌండ్ పూర్తిగా మార్చివేసి, సోషల్ మీడియాలో వదిలిపెట్టారు.

అంతగా ఆకట్టుకోలేని ఫస్ట్ లుక్ పోస్టర్ నే ఆదరించిన నెటిజన్లకు, ఓ అభిమాని రూపొందించిన ఈ పోస్టర్ బాగా నచ్చింది. దీంతో సోషల్ మీడియా సందడి చేస్తోంది ఈ పోస్టర్. బ్యాక్ గ్రౌండ్ లో మాహిష్మతి నగర సామ్రాజ్యం ఉండగా, చేతికి సంకెళ్ళతో నడిచి వస్తున్న ‘బాహుబలి’ లుక్ ను చూసి ఫిదా అవుతున్నారు. ఒక విధంగా “బాహుబలి 2” ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదైతే ఇంకాస్త బాగుండేదన్న అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది.