baahubali-2-leaked-video-talkప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా “బాహుబలి 2”కు సంబంధించిన లీక్ అయిన వీడియో గురించే చర్చ. ‘బాహుబలి 2’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, విడుదలకు ఇంకా చాలా నెలల సమయం ఉండడంతో ఈ సినిమా గురించి ప్రస్తుతం ఎవరూ ఆసక్తి ప్రదర్శించడం లేదు. దానికి తగిన విధంగానే చిత్ర యూనిట్ కూడా పబ్లిసిటీకి దూరంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. అయితే ఉన్నట్లుండి “బాహుబలి 2”కు సంబంధించిన పోరాట సన్నివేశాలు లీక్ అవ్వడం షాక్ కు గురి చేసింది.

మరి ఈ లీక్ అయిన సన్నివేశాలు ఎలా ఉన్నాయి? అంటే… రాజమౌళి దర్శకత్వం వహించాక కూడా ఈ సన్నివేశాల టాక్ గురించి అడగాలా? అనే విధంగా ఉన్నాయన్న టాక్ వినపడుతోంది. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న “బాహుబలి 2” గురించే అందరూ మాట్లాడుకునేలా ఈ లీక్ అయిన సీన్స్ ఉన్నాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. దీంతో సహజంగానే ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను పతాక స్థాయికి తీసుకువెళ్ళడంలో ఈ వీడియో సక్సెస్ అయ్యిందనే టాక్ సోషల్ మీడియాలో సర్వత్రా వినపడుతోంది. అయితే ఈ టాక్ కు మించిన చర్చ మరొకటి జరుగుతోంది.

‘బాహుబలి పార్ట్ 1’ విషయంలోనూ ఇలా యుద్ధ సన్నివేశాలు లీక్ కావడం, ఆ తర్వాత భారీ అంచనాలు ఏర్పడడం తదితర సంగతులు తెలిసినవే. అప్పట్లో ఈ లీక్ ఒక పెద్ద సెన్సేషన్ అయ్యింది. అయితే రెండవ పార్ట్ మేకింగ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పిన తర్వాత కూడా లీక్ కావడం అంటే సాధారణ విషయం కాదు కదా! దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా “రోబో 2.0” ఫస్ట్ లుక్ విడుదలై మీడియాను తన వైపుకు తిప్పుకున్న సమయంలోనే ఈ లీక్ కావడం పట్ల ఉద్దేశపూర్వకమైన చర్యగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే స్తబ్దుగా ఉన్న “బాహుబలి 2”పై అంచనాలు పెంచేందుకు కూడా ఈ లీక్ జరిగిందన్న భావాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇన్ని భిన్న స్పందనలు రావడానికి ప్రధాన కారణం… ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విధానమే. ఐడీ కార్డులు ఉంటేనే షూటింగ్ లొకేషన్ కు అనుమతిని ఇవ్వడం, షూటింగ్ స్పాట్ లో ఎవరూ మొబైల్స్ వినియోగించకపోవడం తదితర కఠిన నిబంధనలు విధించినప్పటికీ ఈ లీక్ అవ్వడం అనేది భిన్న సంకేతాలకు కారణమైంది. అయితే ఈ లీక్ సన్నివేశాలు అనేవి షూటింగ్ స్పాట్ లోవి కాదని, గ్రాఫిక్స్ వర్క్ కూడా కనపడుతుండడంతో ఖచ్చితంగా ‘బాహుబలి 1’ ఎక్కడ లీక్ అయ్యిందో ఈ సన్నివేశాలు కూడా అక్కడ నుండే బయటకు వచ్చిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.

తన సినిమాల పబ్లిసిటీలకు సంబంధించి ఏ విధంగా ప్రమోట్ చేయాలో రాజమౌళి పూర్తి స్పష్టతతో ఉంటారు. ఎప్పుడు అంచనాలు పెంచాలో, తగ్గించాలో అనే విషయంపై రాజమౌళికి తెలిసినంతగా మరొకరికి తెలియదని చెప్పవచ్చు. మరి అలాంటి రాజమౌళి ఇంత చీప్ పబ్లిసిటీని ఇస్తారా? అంటే ఖచ్చితంగా కాదన్న సమాధానమే వ్యక్తమవుతోంది. అయితే ‘బాహుబలి 2’పై ఉన్న క్రేజ్ తో ఎవరో ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో లీక్ చేసారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే… జక్కన్న పెదవి విప్పాల్సిందే..!