Baahubali-2-in-Nepalబాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ సృష్టిస్తున్న ప్రభంజనం అందరికీ తెలిసిందే. అక్కడ, ఇక్కడ అన్న తేడా లేకుండా ‘లోకల్ అండ్ ఓవర్సీస్’ మార్కెట్ ను ఏలుతున్న ఈ సినిమా ఓ అరుదైన ఘనతను కూడా సాధించింది. బహుశా ఈ రికార్డు గురించి దర్శకుడు రాజమౌళితో సహా చిత్ర నిర్మాతలకు కూడా తెలుసో లేదో అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే… ప్రపంచంలో చాలా ప్రాంతాలలో విడుదలైన ఈ సినిమా, అందుకు అనుగుణంగా తగిన పబ్లిసిటీని ఇచ్చారు ‘రాజమౌళి అండ్ కో.’

కానీ, నేపాల్ లో కూడా విడుదలవుతోంది అన్న విషయం రాజమౌళితో సహా ఏ ఒక్కరూ ప్రస్తావించకపోవడం విశేషం. సహజంగా ఇలాంటి విషయాలలో రాజమౌళినే అన్ని దగ్గరుండి చూసుకుంటారు. కానీ, జక్కన్న నోట నుండి కూడా నేపాల్ అంశం ప్రస్తావనకు రాకపోవడంతో, అక్కడ విడుదలవుతోందన్న విషయం బహుశా ‘దర్శకధీరుడు’కు కూడా తెలియదేమో అన్న భావనలు కలుగుతున్నాయి. అయితే రిలీజ్ కావడం అటుంచితే, నేపాల్ లో కూడా ఈ సినిమా చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

నేపాల్ లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా “బాహుబలి 2” 7 కోట్ల గ్రాస్ తో సరికొత్త చరిత్రను సృష్టించింది. తొలి రెండు రోజుల్లో సాధించిన ఈ గ్రాస్ వసూళ్ళలో 5.40 కోట్లు నెట్ గా నమోదైంది. ఒక్క నేపాల్ లోనే కాదు, ఇప్పటికే ఆస్ట్రేలియాలో దంగల్ రికార్డులను దాటేసి 1 మిలియన్ వైపుగా పరుగులు పెడుతోంది. అయితే ఆస్ట్రేలియా, యుకే, కెనడా వంటి తదితర ప్రదేశాల్లో ‘బాహుబలి 2’ రిలీజ్ అవుతున్నట్లుగా భారీగా ప్రచారం జరిగింది. కానీ, నేపాల్ విషయం మాత్రం ట్రేడ్ వర్గాలకు పెద్ద ట్విస్టే!