ఇండియన్ సినిమా చరిత్రను “బాహుబలి 2” తిరగరాస్తోంది. విడుదలైన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోన్న అమరేంద్ర బాహుబలి, ప్రతి రోజు దానిని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాడు. ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చే విధంగా ఓవర్సీస్ మార్కెట్ లో సాధారణ రోజుల్లోనూ 1 మిలియన్ మార్క్ ను అందుకుని అవాక్కు చేస్తున్నాడు. ఇక స్థానిక మార్కెట్ లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీ, తెలంగాణాలలో బ్రేక్ ఈవెన్ దశకు చేరుకున్నాయని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.

ఈ క్రమంలో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా “బాహుబలి 2” అవతరించనుందని సినీ వర్గాలు గర్వంగా చెప్తున్నాయి. ఇంకా చెప్పాలంటే 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకునే మొదటి సినిమాగా రికార్డులు సృష్టించడానికి “బాహుబలి 2”కు ఎంతో సమయం పట్టదని అంటున్నారు. ఇప్పటివరకు 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా, మరో రెండు, మూడు రోజుల్లో పీకే (792 కోట్లను)ను అధిగమించి, రెండవ వారం ముగిసే సమయానికి తొలి 1000 కోట్ల సినిమాగా రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

రెండు వారాలకే 1000 కోట్లు అందుకుంటే, ఓవరాల్ గా ఎంత వసూలు చేస్తుందని ఆశ్చర్యపోనవసరం లేదు. అంతకు ముందు ‘బాహుబలి ది బిగినింగ్’ వసూళ్లు చేసిన మొత్తానికి రెట్టింపు కొల్లగొడుతుందని ఖచ్చితమైన అంచనా. అయితే మే 3వ తేదీన ఒక విశిష్టతను సొంతం చేసుకుంది ఈ సినిమా. భారతీయ చలన చిత్ర చరిత్రకు నాంది పలికిన ‘ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్’ విడుదలైంది కూడా ఈ రోజే. 1913, మే 3వ తేదీన “రాజాహరిశ్చంద్ర” అనే ‘ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్’ విడుదల కాగా, 2017 అదే తేదీ నాటికి ‘బాహుబలి 2’ సరికొత్త అధ్యాయాన్ని లిఖించడం విశేషం.