Baahubali 2 Team dinner lunch ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ సినిమా కోసం యావత్తు ఇండియన్ సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపారు అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని భావిస్తుండడంతో ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరుసగా షెడ్యూల్స్ పూర్తయిన దరిమిలా, ఇటీవల చైనాలో ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే తదుపరి షెడ్యూల్ పై ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఒక ట్వీట్ చేసారు.

జూన్ 13 నుండి తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని, ఇందులో ‘బాహుబలి’ సినిమాలో అత్యంత క్లిష్టమైన క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ జరగనుందని, దాదాపు 10 వారాల పాటు పిచ్చెక్కిపోయే షెడ్యూల్ కు చివరగా ముహూర్తం కుదిరిందని… నిర్మాత చేసిన ట్వీట్ కు జక్కన్న తనయుడు కార్తీకేయ ‘ఆగలేకపోతున్నాను’ అంటూ రీ-ట్వీట్ చేసారు. తాజా సమాచారంతో ‘బాహుబలి’ క్లైమాక్స్ లో ఒక భారీ యుద్ధ సన్నివేశం ఉండబోతుందని, అది సినిమాకే హైలైట్ గా నిలువబోతుందన్న సమాచారాన్ని నిర్మాత పరోక్షంగా ఇచ్చేసారు. అయితే దానిని వీక్షించాలంటే మరో పది మాసాలు వెయిట్ చేయాలి.