Baahubali 2 Brand Ambassador Prabhasఫస్ట్ పార్ట్ తో దాదాపుగా 600 కోట్లు కొల్లగొట్టిన “బాహుబలి” పేరు ఎత్తగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. మరెవరికీ సాధ్యం కాని రీతిలో జక్కన్న ఈ సినిమాను చెక్కడంతో… సర్వత్రా రాజమౌళి పేరే వినపడుతూ వచ్చింది… వస్తోంది కూడా..! అయితే సినిమా ఇంత హిట్ కావడానికి కారణం రాజమౌళి అయ్యుండొచ్చు గానీ, ఈ సినిమా ఇంత రేంజ్ లో రీచ్ కావడానికి మాత్రం కారణం తాను కాదు అంటున్నారు రాజమౌళి. ముఖ్యంగా టాలీవుడ్ తర్వాత ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన బాలీవుడ్ కు రీచ్ కావడానికి కారణం తాను కాదు, ప్రభాస్ అంతకంటే కాదని వివరించారు.

నిజానికి కరణ్ జోహార్ వంటి వారికి ‘బాహుబలి’ గురించి తెలియడానికి కారణం రానానే అని, బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న రానా, ‘బాహుబలి’కి సంబంధించిన సమాచారం అక్కడ చెప్పడంతో, నిజంగా ఒక ప్రాంతీయ భాషలో ఈ రేంజ్ లో సినిమా తీస్తున్నారా? అన్న ఆసక్తి వారికి కలిగిందని, అలాగే కొన్ని షూటింగ్ వీడియోలను మధ్య మధ్యలో వారికి చూపించడంతో… ఆ తర్వాత వాళ్లు తమను సంప్రదించారని, అలా ‘బాహుబలి’ సినిమాకు ‘బ్రాండ్ అంబాసిడర్’ రానానే అని స్పష్టం చేసారు రాజమౌళి. ప్రభాస్ మాదిరి కాకుండా రానాకు టైం అంటే టైం అని, మంచి ప్లానింగ్ ఉన్న ఆర్టిస్ట్ అని రానా గురించి చెప్పుకొచ్చారు.