Baahubali 2 Box office Collectionsఎక్కడ చూసినా… ఎక్కడ విన్నా… ఒక్కటే మాట… ఒక్కటే మోత..! అదే ‘బాహుబలి 2’ రికార్డుల వేట. అవును… ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయం అన్న భేదాభిప్రాయం లేకుండా… ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, వెబ్ మీడియా అన్న తారతమ్యం లేకుండా… సిటీ కేబుల్ నుండి సి.ఎన్.బి.సి వరకు ‘బాహుబలి 2’ గురించిన సంగతులనే చెప్పుకుంటూ ప్రత్యేక కధనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే ప్రతిసారి సంభవించే విషయం కాదు.

ఏదో శతాబ్దానికి ఒక్కటి అన్నట్లుగా ‘బాహుబలి 2’ ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాస్తూ మొదటి 1000 కోట్ల చిత్రంగా నిలవబోతున్న సందర్భంగా ఆనంద పారవశ్యంతో వెలువడుతున్న కధనాలు ఇవి. సాధారణంగా ఒక తెలుగు సినిమాకు బిబిసి వంటి స్థాయి మీడియా సంస్థ ప్రాధాన్యత ఇచ్చిందంటే ‘బాహుబలి 2’ ఏ స్థాయికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఆదివారం నాడు అందరూ ఎదురుచూస్తున్న ‘బిగ్ అనౌన్స్ మెంట్’ రానుందని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు.

దీంతో ‘బాహుబలి 2’ సాధించిన ఈ అమోఘమైన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని మీడియా మొత్తం ఒక్కతాటిపై నిలుస్తూ… ‘సాహోరే బాహుబలి’ అంటూ జైజైలు కొడుతోంది. నిజానికి ఇదేదో ఊహించని విషయం కాదు గానీ, కేవలం 10 రోజుల్లోనే 1000 కోట్లను టచ్ చేస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించని విషయమేనని చెప్పవచ్చు. దీంతో ‘బాహుబలి 2’ సినిమాలో నటించిన నటీనటుల జీవితాలు ఎలా అయితే మారిపోయాయో, ‘బాహుబలి 2’ సినిమాను కొనుగోలు చేసిన పంపిణీ దారుల జీవితాలు కూడా మారిపోయానని స్పష్టమవుతోంది.

ఇక మిగిలింది అతికొద్ది గంటలే… ఆ అధికారిక సమాచారం వెలువడగానే… ప్రతి తెలుగు వాడు మరియు ప్రతి భారతీయుడు పులకించిపోయేలా సంబరాలను జరుపుకోవడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. ఇది అపూర్వం… అమోఘం… అనన్యసామాన్యం..! దీనికి కారణమైన ‘దర్శకధీరుడు’ రాజమౌళికి మరియు ‘బాహుబలి 2’ చిత్ర బృందానికి హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు అందజేద్దాం. ఈ ఉత్సాహంలో సినీ ప్రేక్షకులు మరొకసారి ‘బాహుబలి 2’ ధియేటర్ కు క్యూలు కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.