Baahubali 2 Box Office Collections - 1500 crనేరుగా పాయింట్ గా వస్తే… ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ “బాహుబలి 2”కు చక్కగా సరిపోతుంది. “ఖలేజా” సినిమాలో క్లైమాక్స్ లో రావు రమేష్ పలికించిన… “అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు… జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరము లేదు…” మాటలు ‘బాహుబలి 2’ కలెక్షన్ల ఉధృతికి ప్రతిరూపంగా చెప్పవచ్చు. చిత్ర నిర్మాణం జరుగుతున్నంత సేపు ఎలా తీస్తారు… ఎలా తీస్తారు… అన్న సందేహంతో ఉన్న సినీ ప్రేక్షకులకు రాజమౌళి అద్భుతాన్ని రుచి చూపించడంతో వచ్చిన ఫలితమిది.

‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్ కత్తి పెట్టి నరుకుతుంటే… శ్రీహరి లెక్కపెడుతున్న మాదిరి, బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీని ట్రేడ్ పండితులు 1100, 1200, 1300, 1400 కోట్లు అంటూ లెక్కపెట్టుకుంటూ… నాలుగవ వారం పోస్టర్ పడే సమయానికి 1500 కోట్ల రూపాయల విషయాన్ని అధికారికంగా రాజమాత శివగామిదేవి సాక్షిగా ప్రకటించారు. అవును… ఈ మహోన్నత విజయంలో మకుటాయమానంగా నిలిచిన శివగామి దేవి, దేవసేనలను చెరో వైపు కూర్చోపెట్టి, 1500 కోట్ల పోస్టర్ ను విడుదల చేసారు.

అసలు విషయం ఏమిటంటే… ఈ లెక్క ఇక్కడే ఆగేలా కనపడడం లేదు. ఈ ఉత్సాహం చూస్తుంటే హీనపక్షంగా మరో రెండు వందల కోట్లైనా ‘బాహుబలి 2’కు సమర్పించేలా ఉన్నారు. అటు బాలీవుడ్ లో గానీ, ఇటు టాలీవుడ్ లో గానీ, ప్రేక్షకులు చూడడానికి పోటీలో మరో సినిమా లేకపోవడం, అలాగే ‘బాహుబలి 2’ని చూసిన కళ్ళతో ఓ సాధారణ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు కదలకపోవడంతో… రిపీట్ ఆడియన్స్ ఉధృతి బీభత్సంగా ఉందన్నది ట్రేడ్ రిపోర్ట్. అదే ‘బాహుబలి 2’ ఇంతటి విజయానికి ప్రధాన కారణం.