Baahubali 2 - Bhimavaram 144 Sections‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ కు చెందిన సామాజిక వర్గపు అడ్డాగా పిలవబడే పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో ‘బాహుబలి 2’ విడుదల సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేసారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల మధ్య చోటు చేసుకున్న సంఘటనల రీత్యా… ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. అలాగే పవన్, ప్రభాస్ అభిమానులను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని, నగరంలో ఎలాంటి అలజడి వాతావరణం సృష్టించవద్దని, తమ సూచనలను పక్కనపెట్టి ఆందోళనలు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసారు.

గతంలో ఫ్లెక్సీల విషయంలో పవన్ – ప్రభాస్ ఫ్యాన్స్ నడుమ భీమవరం వేదికగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ముందస్తు చర్యలుగా పోలీసులు ఏకంగా 144 సెక్షన్ ను అమలు చేయడం విశేషం. ‘బాహుబలి 2’ విడుదల సందర్భంగా శివలింగపు ఆకారం లోన ‘సాహో’ అని టైటిల్ ను మంటలతో వెలిగించి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. విడుదల సమయం దగ్గరయ్యే కొద్ది ఈ ఉత్సాహం మరింతగా ఉరకలేస్తుందని చెప్పవచ్చు. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ఇరు వర్గాల అభిమానులకు పోలీసులు ముందుగానే సూచనలు చేయడం శుభపరిణామం.