AyyannaPatrudu house demolished by policeమాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఇంటిపైకి ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు 300 మందికి పైగా పోలీసులు, పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రెండు జేసీబీలను వెంటపెట్టుకొని దండయాత్రకు బయలుదేరినట్లు తరలివెళ్ళి జేసీబీలతో పెరటి గోడను కూల్చివేశారు. ఆ సమయంలో ఇంట్లో పనివారు తప్ప మరెవరూ లేరు. గోడను కూల్చివేసిన తరువాత జేసీబీలను అక్కడే ఉంచి డ్రైవర్లను పంపించివేశారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సర్వే నంబర్ 276-ఏలో అయ్యన్న పాత్రుడి కుమారుడు రాజేష్ సుమారు రెండు సెంట్ల పంట కాలువ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టుకొన్నారని తహశీల్దార్ జయ తెలిపారు. దీనిపై ఈ నెల 2వ తేదీనే రాజేష్‌కు నోటీసు ఇచ్చామని కానీ ఆయన స్పందించకపోవడంతో చట్ట ప్రకారం మరో 15 రోజులు గడువు ఇచ్చామని తెలిపారు. అయినా వారు స్పందించకపోవడంతో పాక్షికంగా కూల్చివేశామని చెప్పారు.

సమాచారం అందుకొన్న అయ్యన్న పాత్రుడు భార్య పద్మావతి, కొద్ది సేపు తరువాత వైజాగ్ నుంచి వారి కుమారు రాజేష్ అక్కడికి చేరుకొని వారిని అడ్డుకొన్నారు. తమకు ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఇంటిని ఎలా కూల్చివేస్తారని వారు ప్రశ్నించారు. తాము ఇంట్లో లేని సమయంలో ఇలా దొంగచాటుగా తెల్లవారుజామున 4 గంటలకు ఇంతమంది పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి గోడ కూల్చవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

ఈ సమాచారం తెలియగానే వేలాదిగా టిడిపి కార్యకర్తలు అక్కడకు చేరుకొని వారిని అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకి మద్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీంతో జిల్లా ఎస్పీ అప్పటికప్పుడు అదనపు బలాలను అక్కడికి రప్పించారు. దీంతో నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇంటిని కూల్చివేయడానికి అధికారులు మళ్ళీ జేసీబీ డ్రైవర్లను రప్పించే ప్రయత్నం చేయగా వారు రాలేదు. దాంతో స్థానికంగా ప్రయత్నించగా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అనకాపల్లి నుంచి జేసీబీ డ్రైవర్లను రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆదివారం కావడంతో ఎవరూ రాలేదు.

చివరికి పద్మావతి, రాజేష్ ఇద్దరూ చొరవ తీసుకొని తమ పార్టీ కార్యకర్తలను శాంతింపజేసి, పోలీసులను కూడా వెనక్కు తగ్గాలని రెవెన్యూ అధికారులకు నచ్చచెప్పారు. తాము ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదని, అయినా రాజకీయ కక్ష సాధింపుగానే ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిందని వారు వాదించారు. తమ ఇంటిని సర్వే చేయించాలని, ఒకవేళ అక్రమంగా నిర్మించుకొన్నట్లు తేలితే తామే స్వయంగా ఇంటిని కూల్చివేస్తామని చెప్పారు. దాంతో రెవెన్యూ అధికారులు అప్పటికప్పుడు సర్వేయర్లను రప్పించి సర్వే మొదలుపెట్టించారు. కానీ టిడిపి కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. సోమవారం ఉదయం సర్వే చేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించడంతో తాత్కాలికంగా ఉద్రిక్తతలు చల్లబడ్డాయి.

వెంటనే రాజేష్ తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ విచారణ చేపట్టి తదుపరి ఆదేశం వెలువడే వరకు కూల్చివేతను నిలిపివేయాలని ఆదేశించారు.

అది అక్రమ కట్టడమే అయితే తెల్లవారుజామున 4 గంటలకు రహస్యంగా వెళ్ళి కూల్చాల్సిన అవసరం ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కూల్చివేతలు చేయకూడదనే మార్గదర్శకాలు మీకు వర్తించవా?అని రెవెన్యూ శాఖ తరపున వాదించిన ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు.

ఇటీవల చోడవరంలో అయ్యన్న పాత్రుడు అధ్వర్యంలో టిడిపి మినీ మహానాడును అట్టహాసంగా నిర్వహించడం, దానిలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు, అయ్యన్న తదితర టిడిపి నేతలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినందునే తమపై కక్షగట్టి తాము ఇంట్లో లేని సమయం చూసి దొంగచాటుగా వచ్చి ప్రహారీగోడ కూల్చివేశారని పద్మావతి, రాజేష్ ఆరోపించారు.