మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాధ్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
“ఏపీలో సాఫ్ట్‌వేర్ హార్డ్ వేర్ కంపెనీలే కాదు చివరికి జాకీ అండర్‌వేర్ కంపెనీని కూడా తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పట్టుకుపోయారు. ఇప్పుడు ఆయన దావోస్ వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు సంపాదించుకొంటుంటే ఇక్కడ మన రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాధ్ రెడ్డి ఇక్కడ ఏం పీకుతున్నారో తెలీదు కానీ ఎంతసేపు మాలాంటి ప్రతిపక్ష నేతలని తిడుతూ కాలక్షేపం చేస్తుంటారు. అందుకే ఆయనకి ఆ మంత్రి పదవి ఇచ్చిన్నట్లున్నారు. మనం దావోస్ వెళ్ళక్కరలేదు వాళ్ళే మన హీరోయిజం చూసి పెట్టుబడులు పెట్టడానికి క్యూకడతారని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు.
దావోస్ సదస్సు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించుకొన్నాక ప్రపంచంలో అందరికీ ఒకేసారి ఆహ్వానాలు పంపిస్తారు. ఎవరికీ ముందుగా పంపించరనే చిన్న విషయం కూడా ఐటి మంత్రిగారికి తెలియకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ఏపీని రాజధానిలేని రాష్ట్రంగా చేసి లక్షల కోట్ల అప్పులలో ముంచేసింది వైసీపీ ప్రభుత్వం. ఏమీ చేయకపోగా రాష్ట్రాన్ని కోలుకోలేని విదంగా దెబ్బ తీస్తున్న వైసీపీకి 175 సీట్లు వస్తాయని ఎలా చెప్పుకొంటున్నారో?” అని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
ఇంతకాలం టిడిపికి దూరంగా ఉండిపోయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్ళీ పార్టీలో యాక్టివ్ అవబోతున్నారనే వార్తలపై స్పందిస్తూ, “టిడిపి కష్టకాలంలో మేమంతా అండగా ఉంటూ అనేక ఒత్తిళ్ళు, వేధింపులు తట్టుకొని భరిస్తూ పోరాడుతూనే ఉన్నాము. కానీ ఆయనేం చేశాడు? పార్టీ అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించి, కష్టకాలంలో కలుగులలో దూరి దాక్కొన్నారు. మళ్ళీ ఎన్నికల దగ్గరపడుతుండటంతో వస్తున్నారు. నెత్తిన పెట్టుకోవడానికి ఆయనేమైనా జాతీయనాయకుడా లేక ప్రధానమంత్రా?పార్టీకి కష్టకాలంలో అండగా ఉందని ఇటువంటి నేతలు మనకి అవసరమా?అని నేను ప్రశ్నిస్తున్నా. టిడిపి ఎప్పుడూ కార్యకర్తలనే నమ్ముకొంది తప్ప నేతలని కాదు. అందుకే ఇటువంటివారు ఎందరు దూరమైనా టిడిపి ధృఢంగా నిలబడే ఉంది. పార్టీకి దూరమైనవారితో సహా అందరూ బాగుండాలనే కోరుకొంటాను,” అని అయ్యన్న బాహాటంగానే గంటా పునః ప్రవేశంపై అభ్యంతరం చెప్పారు.
బీసీలతో టిడిపి అనుబందం గురించి మాట్లాడుతూ, “టిడిపి ఉద్భవించిందే తెలుగువారి ఆత్మగౌరవం కోసం… బీసీల సంక్షేమం. టిడిపి వచ్చిన తర్వాతే బీసీలకి రాజ్యాధికారం హక్కుగా లభిస్తోంది. కనుక ఈరోజు వైసీపీ లేదా మరో పార్టీ వచ్చి బీసీలని నెత్తిన పెట్టుకొంటున్నామని చెపితే అది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయమే. కానీ టిడిపి అధికారంలో ఉన్నా లేకపోయినా బీసీలతో అనుబందం కొనసాగుతూనే ఉంది. త్వరలోనే రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో బీసీ సదస్సులు నిర్వహిస్తాము,” అని అయ్యన్నపాత్రుడు అన్నారు.