ayyanna patruduమాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కంటతడిపెట్టారని ఒక వార్త వచ్చింది. రాష్ట్రం కోసం ఎంత కష్టపడినా ఓటమి ఎదురయ్యిందని ఆయన అన్నారట. ఇంత చేసినా ప్రజలు వైకాపా వైపు మొగ్గడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అన్న క్యాంటీన్‌ల మూసివేత కారణంగా అందరూ బాధపడుతున్నారంటూ అయ్యన్న పాత్రుడు కంటతడి పెట్టారట. అయ్యన్న కూడా ఈ ఎన్నికలలో ఓడిపోయారు.

అయితే కన్నీరు పెట్టుకున్నారు సరే… అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు మర్చిపోతే ఎలా? గంటా శ్రీనివాసరావు తో ఉన్న విభేదాలతో అనేక మారులు మీడియా ముందు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసి, పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీశారు. దానితో పార్టీకి నష్టం జరిగింది. పార్టీ మునగడంతో పాటు నాయకులు కూడా మునిగారు. ఇద్దరూ కొట్టుకుంటారనే ఇద్దరినీ మంత్రులను చేశారు చంద్రబాబు. పైగా ఇద్దరికీ మంచి శాఖలు కేటాయించారు. అయినా తీరు మారలేదు.

కరుణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు టీడీపీ ఓటమికి చాలా కారణాలు… అందులో చిన్నదో పెద్దదో అయ్యన్న పాత్ర కూడా ఉంది అనే చెప్పాలి. ఎవరో జూనియర్ ఇటువంటి పని చేశాడంటే కాదు. అయ్యన్నపాత్రుడు టీడీపీ టిక్కెటు మీద ఇప్పటివరకూ ఒకసారి పార్లమెంట్ కు, ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989, 2009లో మాత్రమే ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి ఓటమి మూటగట్టుకున్నారు. ఇప్పటికన్నా తప్పు తెలుసుకుని సమీష్టిగా పని చేస్తే పార్టీని నిలిపుకోవచ్చు అని పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.