ayyanna-patrudu-Vijaya-Sai-Reddy“విజయసాయి రెడ్డీ… నేను ఎక్కడికి పారిపోలేదు. ఇక్కడే నర్సీపట్నంలోనే ఉన్నాను. నా చుట్టూ వందలమంది పోలీసులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఆర్డీవోలు, జేసీబీలు, పోలీసు వాహనాలతో కాపలా పెట్టింది మీ ప్రభుత్వం. నువ్వే ఢిల్లీలో కూర్చొని కబుర్లు చెపుతున్నావు. కేసుల భయంతో ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేసి ఆంధ్రప్రదేశ్‌కి నష్టం కలిగించిన నువ్వా.. నన్ను విమర్శించేది? ఢిల్లీలో కూర్చొని విమర్శించడం కాదు… దమ్ముంటే నర్సీపట్నం రా. చూసుకొందాం…” అంటూ మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు విజయసాయి రెడ్డికి చాలా ఘాటుగా సవాలు విసిరారు.

“16 నెలలు జైల్లో చిప్పకూడు తినడం వలన నీ చర్మం మందం అయ్యింది. జైలులో తోటిఖైదీలు, ఖాకీల చేతుల్లో దెబ్బలు తినడం వలన నీ ఒంటిపై చారలు ఏర్పడితే వాటిని చూసి పులిని అనుకొంటున్నావు. నిజంగా నువ్వు పులివే అయితే ఒంటరిగా నర్సీపట్నం రా…” అంటూ అయ్యన్న సవాలు విసిరారు.

ఈ నెల 19న తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు, పోలీసులు, జేసీబీలను వెంటబెట్టుకొని వెళ్ళి నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి కుమారుల ఇంటి ప్రహారీగోడను కూలద్రోశారు. అప్పుడు వారిరువురూ హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతలు నిలిపివేయాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ గోడ పునర్నిర్మించుకోవడానికి వారిని అనుమతించింది కూడా. అయితే ఆ ఘటనలు జరిగినప్పటి నుంచి అయ్యన్నపాత్రుడు స్పందించకపోవడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని విజయసాయి రెడ్డి అన్నారు. దానికే అయ్యన్నపాత్రుడు ఇంత ఘాటుగా బదులిచ్చారు. అది ఎంత ఘాటుగా ఉందో తెలియాలంటే అయ్యన్న పోస్ట్ చేసిన ఈ ట్వీట్స్ మీరూ చూడండి.