Ayyanna Patrudu advise to chandrababu naiduశనివారం ఉదయం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు సిఎం జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు. ఈ దుష్టపరిపాలనతో విసుగెత్తిపోయున్న ప్రజలు, పార్టీ శ్రేణులు వైసీపీని గద్దె దించేందుకు సిద్దంగా ఉన్నాయని అన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలలో టిడిపి 160కి తక్కువ కాకుండా సీట్లు గెలుచుకోబోతోందని అచ్చెన్నాయుడు పూర్తి నమ్మకంతో చెప్పారు.

మాజీ మంత్రి, సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఓ మంచి సూచన చేశారు. రాష్ట్రంలో టిడిపిమీ పూర్తి అనుకూలవాతావరణం కనిపిస్తోందని కనుక వీలైనంత త్వరగా పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసి ప్రకటిస్తే వారు ఇప్పటి నుంచే తమ తమ నియోజకవర్గాలలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుందని అన్నారు. తద్వారా పార్టీ విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. టిడిపి, జనసేన పొత్తుల గురించి వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను పట్టించుకోనవసరం లేదని, అవి వారిలో ఆందోళనని, అభద్రతాభావాన్ని సూచిస్తున్నాయని అయ్యన్న పాత్రుడు అన్నారు.

అయ్యన్న పాత్రుడు చాలా మంచి సూచనే చేశారని చెప్పవచ్చు. ఆనవాయితీ ప్రకారం ఎన్నికలకు ముందు పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తే, టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు అలకపాన్పులు ఎక్కడం లేదా పార్టీలు మారడం చేస్తుంటారు. ఓ పక్క ఎన్నికలు ముంచుకొచ్చేస్తుంటే ఈ సమస్యలపై దృష్టి పెట్టడం చాలా కష్టం. పైగా అసంతృప్తి సెగలు పార్టీ శ్రేణుల్లో చీలికలు తెచ్చి పార్టీని బలహీనపరుస్తాయి. ముఖ్యంగా జనసేనతో పొత్తులు పెట్టుకొంటే దానికి సీట్లు కేటాయించవలసి వస్తుంది కనుక దాని వలన తాము ఎక్కడ నష్టపోతామో అని పార్టీలో ఆశావాహులు తీవ్ర ఆందోళనతో ఉంటారు.

అదే… వీలైనంత త్వరగా అభ్యర్ధులను ప్రకటిస్తే, ఈ అయోమయం తగ్గుతుంది. అసంతృప్తి సెగలు మొదలైతే వాటిని చల్లార్చుకొనేందుకు తగినంత సమయం కూడా ఉంటుంది కనుక తక్కువ నష్టంతో ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఒకవేళ జనసేనకు టిడిపితో పొత్తులు పెట్టుకోవాలనే ఆసక్తి ఉంటే ఆ విషయం కూడా వీలైనంత త్వరగా తేల్చేసుకొంటే రెండు పార్టీలకి మంచిది. తదనుగుణంగా ముందుకు సాగవచ్చు. కనుక అయ్యన్నపాత్రుడు చేసిన సూచనపై చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో మరోసారి లోతుగా చర్చించి తగిన నిర్ణయం తీసుకొంటే మంచిదేమో?