Grama Volunteer strikeమొన్న ఆ మధ్య తమ జీతాలు పెంచాలి అంటూ వాలంటీర్లు ఏపీ వ్యాప్తంగా సమ్మె చేశారు. రేషన్ డ్రైవర్లకు పెంచి వెట్టి చాకిరి చేస్తున్న తమకు ఐదు వేలేనా అంటూ నిరసన వ్యక్తం చేశారు. దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసి మీరు చేస్తుంది ఉద్యోగం కాదు సేవ మాత్రమే.. చక్కగా చేసుకుని పుణ్యం సంపాదించుకోండి అని ప్రకటించారు.

తాజాగా వారి సేవకు జీతాలు పెంచకపోయినా సన్మానం చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. సచ్ఛీలత, మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, కోవిడ్‌ –19 సర్వే తదితర అంశాలు ఎంపికకు ప్రామాణికంగా తీసుకుని అవార్డుల ప్రధానం చేస్తారట.

మూడు రకాల కేటగిరీలలో 10,000, 20,000, 30,000 నగదు బహుమానాలు ఉంటాయి. అయితే క్యాటగిరీ పెరిగే కొద్దీ లబ్ధిదారులు తగ్గిపోతారు… చివరి కేటగిరీలో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున అంటే 175*5 … కేవలం 875 మందికి… మొత్తం అన్ని కేటగిరీల లబ్దిదారులను కలుపుకుంటే కనీసం మొత్తం వాలంటీర్లలో 10% కూడా ఉండరు.

ఇదంతా ఏడాదికి ఒక సారి… ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి ఉన్న ఐదేళ్ళలో ఒక ఏడాది ఏమీ లేకుండానే గడిచిపోయింది. ప్రతిసారీ లబ్దిదారులను మార్చినా వచ్చే ఎన్నికల నాటికి సగం మంది కూడా కవర్ కారు. “మా కష్టానికి జీతం పెంచమంటే బిచ్చమేస్తున్నారా?,” అని వాలంటీర్లు ఆగ్రహం చెందుతున్నారు.