Pawan Kalyan -Janasena Porata Yatraఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జనసేన పోరుబాట పడుతోందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేర్చలేదని.. దానిపై జనసేన పోరాడుతుందన్నారు. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి పోరాట యాత్ర ప్రారంభిస్తామని పవన్‌ చెప్పారు.

రాష్ట్రంలోని 175 నియోజవర్గాల్లో వేలాది మంది యువత, విద్యార్థులతో ర్యాలీలు, జిల్లా కేంద్రాల్లో లక్ష మందితో నిరసన కవాతు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలను గుర్తించి, అధ్యయనం చేసి వాటి పరిష్కార మార్గాలు చూపుతామన్నారు. ఇదంతా బానే ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి ఎవరు కారణమో ఎవరి మీద పోరాటం చేయబోతున్నారో పవన్ కళ్యాణ్ చెప్పలేదు.

టీడీపీ విమర్శిస్తున్నట్టు పవన్ బీజేపీ గ్రిప్ లోకి వెళ్లడం వల్లో మరొకటో తెలియదుగానీ జనసేనాని కూడా జగన్ లాగా స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి చంద్రబాబే కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇటీవలే జరిగిన కర్ణాటక ఎన్నికలలో కూడా బీజేపీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రయత్నమూ చెయ్యలేదు. కాబట్టి జనసేన పోరాట యాత్ర పోరాటం ఎవరి మీదో?