Avanti Srinivas responds on vizag gas leak victimsవిశాఖపట్నంలో గ్యాస్ లీకేజీ కి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత గ్రామం ఆర్ఆర్ వెంకటాపురంలో వాసులు ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. భారీగా నష్టపరిహారం ఇవ్వడంతో ఈ గొడవ ఇక్కడితో సర్దుమణిగిపోతుంది అనుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా కంగుతిన్నారు.

లీకేజీ జరిగి దాదాపు 60 గంటలు అవుతున్నా కంపెనీ యాజమాన్యం పై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ఆగ్రహించిన బాధితులు… తమ కుటుంబ సభ్యుల మృతదేహాలతో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు. నష్టపరిహారం కాదు తమకు శాశ్వత పరిష్కారం కావాలని, వెంటనే కంపెనీని మూసెయ్యాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కు అయిందని కూడా వారు ఆరోపించారు. “అదే కంపెనీలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇప్పటికే నష్టపరిహారం ప్రకటించాం. ఈ విషయాన్నీ ఇక్కడితో వదిలెయ్యండి. పెద్దది చెయ్యొద్దు అని కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వచ్చి అంటున్నారు,” అని కొందరు ఆరోపించారు.

ఈ ఘటనపై స్థానిక మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. “వారందరినీ కొంతమంది రెచ్చగొట్టారు… ఎవరూ రెచ్చిపోవద్దు…. ఆ ఐదు గ్రామాలలో ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం,” అని చెప్పుకొచ్చారు. బాధితుల ఆందోళన మీకు రెచ్చిపోవడం కింద కనిపిస్తుందా అంటూ మంత్రి గారి మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.