Avanti Srinivas fires on chandrababu naiduవైఎస్సార్ కాంగ్రెస్ నేతల వైఖరి వింతగా ఉంటుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్‌ విసిరారు. పులివెందుల నుంచి రౌడీలను రప్పించారన్న వ్యాఖ్యలపై అవంతి ఫైర్‌ అయ్యారు. బయటి నుంచి రౌడీలు వచ్చారని నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని అవంతి సవాల్ చేశారు.

అయితే.. నిరూపిస్తే మాత్రం తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి స్పష్టం చేశారు. నిన్న చంద్రబాబుని నిర్బంధించడంలో అధికార పార్టీ పాత్ర లేదని, స్థానిక ప్రజలే ఆయన మీద తిరగబడ్డారని చెప్పుకొచ్చారు. ఇక్కడ విశేషం ఏమిటంటే…చంద్రబాబు విశాఖకు వచ్చే ఒక్క రోజు ముందు సదరు మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని, అడ్డుకోకపోతే ఆయన అమరావతి వెళ్లి, విశాఖ ప్రజలకు క్యాపిటల్ అవసరం లేదని చెబుతారని చెప్పుకొచ్చారు.

చంద్రబాబుని ఎయిర్ పోర్టులో అడ్డుకున్న సందర్భంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిరసనకారులు పట్టుకున్న ప్లకార్డులలో మంత్రిగారి బొమ్మలు, వైఎస్సార్ కాంగ్రెస్ పేర్లు ఉండటం గమనార్హం. ఇంకో వీడియోలో వచ్చిన వారికి బిర్యానీ పొట్లాలు పంచుతున్న విజువల్స్ కూడా ఉన్నాయి. ఇంకో వీడియోలో ఒక మహిళ తమకు ఇస్తా అన్న డబ్బులు ఇవ్వలేదని గొడవ పడుతుంది.

ఈ వీడియోలు అన్నీ అధికార పార్టీకి అప్రతిష్ట తెచ్చిపెట్టేవే. మంత్రిగారు మాత్రం తమకు సంబంధం లేదు అనడం విశేషం. బహుశా ఆయన పులివెందుల నుండి తెచ్చారు అనడంతో నోచుకున్నారేమో… మేము లోకల్ గానే తెప్పించాం అంటే అంతగా బాధ పడేవారు కాదేమో. ఏది ఏమైనా ఈ ఘటనతో వైఎస్సార్ కాంగ్రెస్ తన అధికార బలం నిరూపించింది. దీనికి టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.