2021 టీ20 ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. టాస్ గెలవడమే మ్యాచ్ గెలిచిందన్న చందంగా న్యూజిల్యాండ్ కు ఎక్కడా అవకాశం కల్పించకుండా 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ విజయంలో వార్నర్ (53), మార్ష్ (77) కీలక భూమిక వహించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను మార్ష్ సొంతం చేసుకోగా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను వార్నర్ (289 పరుగులు) కైవసం చేసుకున్నాడు.

స్టోరీ ఇక్కడ బాగానే ఉంది, గెలిచిన ఆస్ట్రేలియా పండగ చేసుకుంటుండగా, ఓడిన కివీస్ నిరుత్సాహంలో ఉంది. కానీ మన హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం సన్ రైజర్స్ ను సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. దానికి కారణం ఏమిటో… క్రికెట్ ప్రేమికులకు ఇప్పటికే అర్ధం అయ్యుంటుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తీవ్రంగా అవమానించిన విషయం తెలిసిందే.

Also Read – పోస్టల్ బ్యాలట్‌ కూడా ఇలా బెడిసి కొట్టిందేమిటబ్బా!

అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న వార్నర్ చేత క్రీజులో ఉన్న బ్యాట్స్ మెన్లకు బాటిల్స్ పంపించిన సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో వార్నర్ ఫామ్ లోకి రావడం, ఆసీస్ కు ప్రపంచ కప్ ను తేవడం సన్ రైజర్స్ కు తలనొప్పిగా మారింది. మరొక విషయం ఏమిటంటే… ఇప్పటికే వార్నర్ ను ఐపీఎల్ ఆక్షన్ కు కేటాయించేసింది హైదరాబాద్ జట్టు. దీంతో మన తెలుగు వాళ్ళ ఆక్రోశాన్ని సన్ రైజర్స్ యాజమాన్యం ట్రోల్స్ రూపంలో చవిచూస్తోంది.