Australia Vs South Africa - Proteas hit second-highest ODI run chaseప్రపంచ క్రికెట్ లో ఇప్పటికే ఆస్ట్రేలియాకు ఒక షాక్ ఇచ్చిన దక్షిణాఫ్రికా మరోసారి గట్టి షాక్ నే ఇచ్చింది. 438 పరుగుల రికార్డు లక్ష్యాన్ని అందుకున్న సఫారీలు, మరోసారి 372 పరుగుల లక్ష్యాన్ని చేధించి కంగారులను బెంబేలేత్తించారు. డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ టీం 371 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. వార్నర్ 117, స్మిత్ 108 పరుగులతో పాటు ఫించ్ 53, హెడ్ 35 రాణించడంతో భారీ స్కోర్ సాధించింది. ప్రపంచ మేటి బౌలర్ అయిన స్టెయిన్ 10 ఓవర్లు వేసి ఏకంగా 96 పరుగులు సమర్పించుకోవడం విశేషం.

ఇక, భారీ లక్ష్య చేధనను గ్రాండ్ గా ఆరంభించిన దక్షిణాఫ్రికా, తొలి వికెట్ ను 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఏ దశలోనూ నెట్ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తపడ్డారు సఫారీ బ్యాట్స్ మెన్లు. ఓపెనర్లు డీకాక్ 70, ఆమ్లా 45 పరుగులు చేయగా, డుప్లేసిస్ 33, డుమినీ 20 పరుగులు చేసారు. అయితే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు డేవిడ్ మిల్లర్. కేవలం 79 బంతులను ఎదుర్కొన్న మిల్లర్ అజేయమైన 118 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 7వ వికెట్ కు ఫేహ్లుక్వాయో(42)తో కలిసి అబేధ్యమైన 107 పరుగుల భాగస్వామ్యంతో చివరి ఓవర్ లో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో 3-0తో లీడ్ చేస్తూ కప్ ను కైవసం చేసుకుంది దక్షిణాఫ్రికా.