australia-v-south-africa-2016ఆస్ట్రేలియాలో ఆసీస్ ను కొట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఎంతటి హేమాహేమీ జట్లైనా సరే, ఆసీస్ గడ్డపై కుదేలు కావాల్సిందే అన్న విషయాన్ని చరిత్ర చెప్తోంది. అయితే ఆ చరిత్రను సఫారీలు తిరగరాసారు. 3 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను వరుసగా 2-0తో మట్టి కరిపించి ఆస్ట్రేలియా వెన్ను విరిచింది. దీంతో సొంతగడ్డపై తీవ్ర పరాభవంతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో సహా ఆటగాళ్ళంతా తలదించుకుంటున్నారు. ముఖ్యంగా రెండవ టెస్ట్ లో ఆసీస్ ఆటగాళ్ళ ప్రదర్శన తీవ్ర విమర్శలకు దారి తీసింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు కేవలం 85 పరుగులకే ఆసీస్ ను వెనక్కి పంపిందంటే ఏ స్థాయిలో బ్యాట్స్ మెన్లు తమ ప్రతిభను చూపించారో అర్ధం చేసుకోవచ్చు. స్మిత్ (48), మిన్నీ (10) మినహా రెండంకెల స్కోర్ ను ఎవరూ దాటకపోవడం విశేషం. దీనికి బదులుగా సఫారీలు 326 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో, భారీ ఆధిక్యం సఫారీల సొంతమైంది. ఇక రెండవ ఇన్నింగ్స్ లోనైనా కుదురుకుని పోరాటపటిమను ప్రదర్శిస్తారని భావిస్తే… అది కూడా ఆవిరయ్యింది.

తొలి ఇన్నింగ్స్ లో నమోదు చేసిన స్కోర్ ను రెట్టింపు కూడా చేయకముందే మొత్తం 10 మంది బ్యాట్స్ మెన్లు పెవిలియన్ చేరుకోవడంతో 80 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విజయకేతనం ఎగురవేసి సిరీస్ ను సొంతం చేసుకుంది. రెండవ ఇన్నింగ్స్ లో కూడా వార్నర్ (45), ఖవాజా (64), స్మిత్ (31) మినహా మరొకరు రెండంకెల స్కోర్ ను అందుకోలేకపోయారు. ఒకానొక దశలో 129 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పటిష్ట దశలో ఉన్న ఆసీస్, కేవలం 161 పరుగులకు ఆలౌట్ కావడం వెనుక, సఫారీ బౌలర్ అబ్బాట్ 6 వికెట్లతో బెంబేలెత్తించాడు. మొత్తం మ్యాచ్ లో 9 వికెట్లతో సత్తా చాటడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.