Australia suffering a whitewash South Africa ODIఒకప్పుడు ప్రత్యర్ధులను ‘వైట్ వాష్’ చేయడమే ఆ టీంకు తెలిసిన ఏకైక పని. ప్రత్యర్ధి జట్టుతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఆధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా పని అయిపోయినట్టేనా? ప్రపంచంలో ఉన్న ఇతర జట్లన్నీ ఈ కంగారులను పరిగెత్తించడం ఖాయమేనా? సంకేతాలు అయితే అలాగే కనపడుతున్నాయని క్రీడా పండితులు చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాల ఆసీస్ జట్టు ఆటతీరును పరిశీలిస్తే… ప్రస్తుతం ఉన్న ఆసీస్ టీం చాలా పరాభవాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.

ముఖ్యంగా 2016వ సంవత్సరంలో మూడు ఫార్మాట్ లలోనూ ‘వైట్ వాష్’లు చేయించుకుని సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది ఆసీస్ జట్టు. టీ 20లలో టీమిండియా చేతిలో 2-0తో దెబ్బతిన్న కంగారులు, ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా 3-0తో ‘క్లీన్ స్వీప్’ అయ్యారు. ఇక, తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్ డే సిరీస్ ను ఏకంగా 5-0తో కోల్పోయి, విమర్శకులకు పని చెప్పారు. ఇలా ఒకే ఏడాది మూడు ఫార్మాట్ లలోనూ ‘క్లీన్ స్వీప్’ చేయించుకున్న ఏకైక జట్టుగా ఆసీస్ నిలవడం విశేషం.

ఒకప్పుడు సమిష్టి కృషికి కేరాఫ్ అడ్రస్ అయిన ఆస్ట్రేలియా జట్టు, ప్రస్తుతం క్లీన్ స్వీప్ లకు పర్మినెంట్ చిరునామాగా మారుతోంది. దీంతో ప్రపంచ క్రికెట్ లో ఆసీస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడినట్లేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆటలో ఆటుపోటులు సహజమే. కానీ, ఆసీస్ జట్టుకు ఇప్పటివరకు పోటులు వేయడమే అనుభవం. దీంతో పడి లేచిన కెరటం మాదిరి ఉవ్వెత్తున ఎగసి పడతారో లేక ఇప్పటికే పాతాళానికి చేరువైన టీం మరింతగా క్రిందకి జారతారో చూడాలి.