Attempt to kill Nellore TDP incharge Kotamreddy Srinivasulu Reddy ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒకప్పుడు రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతుండేవి. వాటికి అనేకమంది బలైపోతుండేవారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి వాటిని ఉక్కుపాదంతో అణచివేయడంతో రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు క్రమంగా కనుమరుగైపోయాయి. కానీ గత మూడున్నరేళ్ళుగా మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు రాష్ట్రమంతటా విస్తరిస్తుండటం చాలా ఆందోళన కలిగిస్తోంది.

నెల్లూరు జిల్లా టిడిపి ఇన్‌ఛార్జ్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఆయన ఇంటివద్దే నాగవెంకట రాజశేఖర్ రెడ్డి అనే ఓ యువకుడు కారుతో గుద్ది హత్యాప్రయత్నం చేసి పారిపోయాడు. అయితే కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తృటిలో తప్పించుకోగలిగారు. ఈ దాడిలో ఆయన ఎడమకాలికి తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు ఆయనని అపోలో హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. హాస్పిటల్‌లో ఉన్న ఆయనకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి పరామర్శించారు.

ఈ ఘటనపై నారా లోకేష్‌ తీవ్రంగా స్పందిస్తూ, “జగన్‌ రెడ్డిగారి మూడు రాజధానులకి తోడు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా నెల్లూర్ణి ప్రకటించినట్లు ఉంది దుస్థితి. పెద్ద సైకో పాలనలో ఊరికో సైకో స్వైరవిహారం చేస్తున్నాడు. నెల్లూరు సిటీ టిడిపి ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేయడం దారుణం. దాడికి పాల్పడిన వైసీపీ సానుభూతిపరుడు సైకో రాజశేఖరరెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి,” అని ట్వీట్ చేశారు.