టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై నిన్న విజయవాడలో కొందరు దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ హైడ్రామా వెనుక రాజకీయ కోణాలున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి అంటూ ఈరోజు సాక్షి ఒక కథనం వెల్లడించింది. ప్రజాదరణ కోల్పోవడం, పంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణుల్లో నైరాశ్యంతో ఎల్లో మీడియా, సోషల్‌ మీడియాను నమ్ముకుని చంద్రబాబు ఈ డ్రామాకు తెరతీసినట్లు స్పష్టమవుతోంది అని చెప్పుకొచ్చింది.

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం.. అన్నీ బాబే అంటూ తేల్చేసింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే దాడికి సంబంధించిన విజువల్స్ ఆ తరువాత తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఈ కేసులో పోలీసులకు లభించిన ఒకే ఒక్క ఆధారం ఆ సిసిటీవీ ఫ్యూటేజ్. ఒకవేళ దాడి టీడీపీ వారే చేయించి ఉంటే… అలా పోలీసులకు ఆధారం ఎందుకు అందిస్తారు?

దాడి చేసింది కొడాలి నాని అనుచరుడు అంటూ టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. విజువల్స్ లో ఉన్నదీ అతనే అంటున్నారు. అయితే సదరు వ్యక్తిని ఎందుకు విచారించలేదు? ఏది ఏమైనా ఈ కేసులో కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం అవ్వడం దోషులను వీడియో ఉన్నా పట్టుకోకపోవడం అంటే అధికార పార్టీ మీద అనుమానాలు రావడమే సహజం.

అదంతా పక్కన పెడితే పట్టాభి రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ నేత కాదు…. ఒకవేళ పంచాయితీ ఎన్నికల కోసమే అయితే ఎవరైనా రాష్ట్ర స్థాయి నేత తో డ్రామా ఆడించేవారేమో. ఇది ఇలా ఉండగా… గతంలో కోడి కత్తి డ్రామా ఆడిన జగన్ అందరూ తనలాగే ఉంటారని అనుకుంటున్నారు అంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో సాక్షిని ఎద్దేవా చేస్తున్నారు. అందరికీ కోడి కత్తి తెలివితేటలు ఎక్కడ వస్తాయి అని వారు ఆక్షేపిస్తున్నారు.