Attack on Chandrababu Naidu Convoy in Nandigamaకూల్చివేతలు, పేరు మార్పులు, వైసీపీ రంగులు, అర్దరాత్రి అరెస్టులు, భౌతిక దాడులు…. వైసీపీ పాలనలో కొట్టవచ్చిన్నట్లు కనిపిస్తున్నవి ఇవి మాత్రమే. ఇటీవల హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌ వాహనాన్ని వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు! నిన్న నర్సీపట్నంలో పోలీసులు అర్దరాత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ దూకి అరెస్ట్! ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కూల్చివేత! ఈరోజు సాయంత్రం నందిగామలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో విద్యుత్‌ సరఫరా నిలివేసి రాళ్ళ దాడి! రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార నీచ రాజకీయాలను చూసి సామాన్య ప్రజలు సైతం అసహ్యించుకొంటున్నారు.

టిడిపి, జనసేనలు ఈ వేధింపులను, దౌర్జన్యాలను తట్టుకొని ఇంకా ఎంతకాలం నిలబడగలవో తెలీదు కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పక తప్పదు. బిజెపి నేత విష్ణుకుమార్ రాజు సైతం రాష్ట్రంలో ఈ అరాచక పరిస్థితులను సహించలేక తమ అధిష్టానం నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.

ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామలో రోడ్ షో నిర్వహిస్తుండగా హటాత్తుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో ఆయన వాహనం చుట్టూ చాలా మంది జనం ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు నాయుడు భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ రక్షణగా నిలబడ్డారు. కరెంట్ పోగానే ఆ చీకటిలో ఎవరో చంద్రబాబు నాయుడుపైకి రాళ్ళు విసిరారు. వాటిలో ఒకటి చంద్రబాబు నాయుడు భద్రతాధికారి మధుబాబుకి గాయం అయ్యింది.

ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “వైసీపీ గూండాల్లారా దమ్ముంటే ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడండి. అంతే కానీ పులిచింతల ఫ్యాక్షన్ రాజకీయాలు నా దగ్గర చేయొద్దు… లైట్లు ఆర్పేసి చీకట్లో దొంగచాటుగా రాళ్ళు విసరడానికి సిగ్గనిపించడం లేదా? ఇటువంటి దాడులకు భయపడేవాడిని కాను నేను. నా చుట్టూ వందల మంది పోలీసులను కాపలా పెట్టారు. కానీ ఏం ప్రయోజనం?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.