Athma Sakshi Analyzing TDP's revival in Telanganaఇటీవల చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో టిడిపిని మళ్ళీ యాక్టివ్ చేసి, ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించడంపై అటు తెలంగాణలో బిఆర్ఎస్‌ నేతలు, ఇటు ఏపీలో వైసీపీ నేతలు తమదైన శైలిలో భాష్యం చెపుతున్నారు. వైసీపీ ఆత్మసాక్షి కూడా తనదైన శైలిలో విశ్లేషించింది.

ఏపీలో టిడిపికి, చంద్రబాబు నాయుడుకి ఆదరణ కరువైంది. వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశాలు లేవు కనుకనే ఆయన మళ్ళీ తెలంగాణలో టిడిపిని యాక్టివ్ చేస్తున్నారని పేర్కొంది. అయితే చంద్రబాబు నాయుడుకి ఇక్కడే కాదు అక్కడ తెలంగాణలో కూడా ప్రజాధారణ లేదని తేల్చి చెప్పింది. టిడిపి ఏనాడూ ఒంటరిగా పోటీ చేయలేదని, అందుకే ఏదో ఓ పార్టీతో పొత్తుల కోసం వెంపర్లాడుతోందని సిఎం జగన్‌ తన కడప పర్యటనలో ఇదే విషయాలు క్లుప్తంగా చెప్పారని ఆత్మసాక్షి కనిపెట్టి పాఠకులకి చెప్పింది. పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితం గురించి సిఎం జగన్‌ చాలా హుందాగా చెప్పదలచుకొన్న విషయం చెప్పారని ఆత్మసాక్షి చెప్పింది.

ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు రోడ్ షోలకి సభలకి వేలాదిగా జనాలు తరలివస్తున్నారు. వారి కోసం టిడిపి నేతలు బస్సులు, లారీలు ఏర్పాటు చేసి తరలించి తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు సభలకి వస్తున్న ఆ జనసందోహాన్ని చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ అధినేత బటన్ నొక్కి సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచుతున్నా ఇంత మంది జనం రావడం లేదు. ఆ వచ్చినవారు కూడా నయన్నో, భయన్నో నచ్చజెప్పి తీసుకొచ్చినవారే! వారూ సిఎం జగన్‌ మాట్లాడుతుంటే మద్యలో లేచి వెళ్ళిపోతున్నారు. కనుక ఎవరికి ప్రజాధారణ ఉందో అర్దమవుతూనే ఉంది.

చంద్రబాబు నాయుడు నిన్న బొబ్బిలిలో మాట్లాడుతూ “నేనేమీ సినిమా యాక్టర్‌ని కాను మీకు ఇప్పుడు డబ్బులు పంచడానికి రాలేదు… అయినా ఇన్నివేలమంది తరలివచ్చారంటే నామీద మీకు ఎంత అభిమానం ఉందో అర్దం అవుతోంది,” అని అన్నారు. ఇది అక్షరాల నిజం. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి ప్రజాధారణ లేకపోయుంటే టిడిపి నేతలు డబ్బు ఖర్చు చేసి అన్ని వేలమందిని తరలించి తీసుకురాలేరు కదా? ఏపీలో చంద్రబాబు నాయుడుకి, టిడిపికి ఇంత ఆదరణ ఉంటే లేదని చెప్పడానికి మనసాక్షి ఎలా ఒప్పుకొందో?

తెలంగాణలో కూడా టిడిపికి ఆదరణ లేదని వైసీపీ ఆత్మసాక్షి కనిపెట్టి చెప్పింది. అయితే నాలుగేళ్ళ తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు ఖమ్మంలో బహిరంగసభలో పాల్గొంటే దానికి, ఏపీలో జగన్‌ సభల కంటే మూడింతలు ఎక్కువ మంది వచ్చారు. ఆ సభకి వచ్చిన జనాలని చూసి బిఆర్ఎస్‌ నేతలు ఉలిక్కిపడి హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబు నాయుడుని విమర్శించడమే తెలంగాణలో టిడిపికి బలం ఉందని బిఆర్ఎస్‌ కూడా దృవీకరిస్తోంది కదా?