Atchannaidu Arrested: Complete Details of the Alleged Scamఇటీవలే హైకోర్టు నుండి బెయిల్ పొందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే… మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఎట్టకేలకు ఇంటికి వెళ్లారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న ఆయన ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. శనివారం చేసిన కరోనా టెస్టులో ఆయనకు నెగటివ్ రావడంతో ఆయనను డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు.

ఈ సందర్భంగా అచ్చెన్నకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, అశోక్ బాబు స్వాగతం పలికారు. గతంలో జైలు నుండి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి పై విడుదల కాగానే ప్రభుత్వం లాక్ డౌన్ ఉల్లంఘన కేసు విధించడంతో తెలుగుదేశం పార్టీ అలెర్ట్ అయ్యింది. ఆసుపత్రి దగ్గర ఎటువంటి హడావిడి లేకుండా జాగ్రత్త పడింది.

ఆస్పత్రి నుంచి నేరుగా అచ్చెన్నాయుడు ఇంటికి బయల్దేరారు. ఇకపోతే ఈ కేసులో ఆయనకు ఆర్ధిక లబ్ది ఉన్నట్టుగా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు ఏసిబీ చెప్పడం గమనార్హం. మందుల కొనుగోలు విషయంలో సరైన పద్దతి పాటించలేదు అని తేలింది. అయితే దానివల్ల అచ్చెన్నాయుడుకు ఎటువంటి లబ్ది చేకూరిందని ఏసిబీ నిరూపించలేకపోతే కేసు నిలబడే అవకాశం లేదని వారు అంటున్నారు.

అరెస్టుకు ముందు అచ్చెన్నాయుడు ప్రభుత్వం మీద గట్టిగా విమర్శలు చేసే వారు. టీడీపీ తరపున ప్రభుత్వం పై గట్టిగా పోరాడే వాయిస్ ఆయనది. దాని వల్లే ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసిందని టీడీపీ వారి ఆరోపణ. తాజా సంఘటనల నేపథ్యంలో ఆయన చల్లబడతారా లేదా తనకు జరిగిన అవమానం గురించి మరింతగా విజృంభిస్తారా చూడాల్సిన అవసరం ఉంది.