Atchannaidu Arrested: Complete Details of the Alleged Scamమాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మూడు నెలలుగా జైలు ఉన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన పాత్ర ఉందంటూ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడుకు ఒక సర్జరీ జరిగిందని చెప్పినా వినకుండా పోలీసులు అరెస్టు చెయ్యడంతో ఆయనకు రెండో సారి సర్జరీ చెయ్యాల్సి వచ్చింది.

అదే సమయంలో ఆయనకు జైలులోనే కరోనా సోకింది. ఆయన బెయిల్ పిటిషన్ ను పోలీసులు వ్యతిరేకిస్తూ… ఆయనను జైలుకే పరిమితం చేశారు. అయితే ఆ కుంభకోణంలో ఆయనకు ఆర్ధిక లబ్ది ఉన్నట్టుగా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు ఏసిబీ చెప్పడం గమనార్హం. మందుల కొనుగోలు విషయంలో సరైన పద్దతి పాటించలేదు అని తేలింది.

అయితే దానివల్ల అచ్చెన్నాయుడుకు ఎటువంటి లబ్ది చేకూరిందని ఏసిబీ నిరూపించలేకపోతే కేసు నిలబడే అవకాశం లేదు. ఆరోపణలు ఎదురుకుంటున్న సంస్థను సిఫార్సు చెయ్యడమే అచ్చెన్నాయుడు చేసిన తప్పుగా ఇందులో చూపిస్తున్నారు. అయితే అది అవినీతి సంబంధింత కేసు అని పరిగణించలేం అని న్యాయనిపుణులు అంటున్నారు.

దీనితో కేవలం కక్ష సాధింపుగానే అచ్చెన్నాయుడుని ప్రభుత్వం జైలులో ఉంచారని అర్ధం అవుతుందని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం తరపున గట్టిగా మాట్లాడే ఆయనను ఏదో విధంగా అణచివేసి అలాగే ఆయన కుటుంబం నుండి ఎన్నికైన ఒక ఎంపీ, ఇంకో ఎమ్మెల్యేని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ అరెస్టు చేసారని వారి ఆరోపణ.