Kinjarapu Atchannaiduఏ రాష్ట్రంలోనైనా అధికార ప్రతిపక్షపార్టీల మద్య విమర్శలు, ఆరోపణలు, పోటీ సహజం. అయితే అవి ఆరోగ్యకరంగా ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం బలంగా ఉంటేనే రాజకీయపార్టీలకి రక్షణ ఉంటుంది. అవి మనుగడ సాగించగలవు. కానీ ఇంత చిన్న విషయాన్ని మరిచిపోయి అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే ఏమవుతుందో తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలు అనుభవపూర్వకంగా తెలుసుకొన్నాయి. ఆ రెండు పార్టీలు ఎదుర్కొన్న చేదు అనుభవాలని చూసిన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీల తీరు మారకపోవడం గమనిస్తే అవి కూడా భవిష్యత్‌లో అటువంటి చేదు అనుభవాలని రుచి చూసేందుకు తహతహలాడుతున్నాయని భావించాల్సి ఉంటుంది.

చంద్రబాబు నాయుడు పర్యటనలలో తొక్కిసలాటలలో 11 మంది మరణించడంతో ఏపీ ప్రభుత్వం హడావుడిగా జీవో నంబర్: 1 తీసుకువచ్చింది. తొక్కిసలాటలు జరుగకుండా నివారించడమే దాని ఉద్దేశ్యమైతే ప్రతిపక్షాలు కూడా హర్షించేవి. కానీ ఆ సాకుతో ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు పెట్టుకొనీయకుండా ఆంక్షల పేరుతో అడ్డుకొనే ప్రయత్నాలు చేయడంతో హైకోర్టుని ఆశ్రయించాయి. హైకోర్టు కూడా ఆ జీవో ఉద్దేశ్యాన్ని తప్పు పడుతూ దానిపై స్టే విధించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ జీవోపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందో ఊహించుకోవచ్చు.

ప్రతిపక్ష నేతలని రోడ్లపై తిరగకుండా అడ్డుకొని ప్రజలకి దూరం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగానే, తాజాగా ఎన్టీఆర్‌ జిల్లాలోని గొల్లపూడిలోని టిడిపి కార్యాలయాన్ని పోలీసుల సాయంతో స్వాధీనం చేసుకొని, దానికి హడావుడిగా ఖాళీ చేసి, రంగులు వేయిస్తోంది.

టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమ ట్విట్టర్‌లో స్పందిస్తూ, “గొల్లపూడి పార్టీఆఫీస్ వద్ద జెండాలు,పెక్సీలు, కటౌట్లు తొలగించి రంగులు మార్చారు. ఏందుకంత భయం? ప్రశ్నించే గొంతులు నొక్కి, నేతల అరెస్టులు, చంపేస్తామని బెదిరిస్తున్నారు. పాలించమని ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరచడం మొదలుపెడితే ప్రజలు మీకు మీపతనాన్ని పరిచయం చేస్తారు,” అని ట్వీట్ చేశారు. దాంతో పాటు గొల్లపూడిలో టిడిపి కార్యాలయానికి రంగులు వేస్తున్న వీడియోని కూడా జత చేశారు.

రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుపడుతూ ట్వీట్ చేశారు. “పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గొల్లపూడి టీడీపీ కార్యాలయానికి కొత్త రంగులు వేసి, కార్యాలయంలో రక్తదానం తదితర కార్యక్రమాల కోసం ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాక, లీజు గడువు ఇంకా 6 నెలలు ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తుల కుటుంబ తగాదాలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం విచిత్రం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి టీడీపీ కార్యాలయాన్ని కబ్జా చేసి వైసీపీ బోర్డు తగిలించడం కోసం స్థల హక్కుదారును అంతమొందిస్తాం అని బెదిరించడం వీరి బరితెగింపు కు నిదర్శనం. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై జగన్ రెడ్డి ప్రభుత్వం కు ఇంత హడావిడి దేనికి?” అని కింజారపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.