atal-bihari-vajpayee about rajiv gandhi93 ఏళ్ళ వయసులో 2018 ఆగష్టు 16వ తేదీన కాలం చేసిన వాజ్ పేయి 1988లోనే మృత్యువు ఒడిలోకి వెళ్లివచ్చారు. నాడు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వాజ్ పేయి విదేశాల్లో చికిత్స చేయించుకుంటే తప్ప బ్రతకడం సాధ్యం కాదని తేల్చేసారు. అయితే ఈ విషయం తెలుసుకున్న నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, వెంటనే ప్రధాని కార్యాలయానికి వాజ్ పేయిని ఆహ్వానించారు.

ఐక్యరాజ్యసమితి సదస్సుకు వెళ్ళే బృందంలో మీ పేరును కూడా చేరుస్తున్నానని చెప్పిన రాజీవ్, సదస్సు అనంతరం న్యూయార్క్ వెళ్లి మూత్రపిండాలకు శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. దీనికి వాజ్ పేయి కూడా అంగీకరించి నాడు అలా తన కిడ్నీ వ్యాధిని నయం చేసుకున్నారు. సదరు సంగతులను వాజ్ పేయి స్వయంగా ఓ సీనియర్ పాత్రికేయుడుతో పంచుకున్నారు.

ఈ రోజు తాను బ్రతికి ఉన్నానంటే కారణం రాజీవ్ గాంధీయేనని వివిధ సందర్భాలలో వాజ్ పేయి పేర్కొనడం ఆయన సంస్కారాన్ని సూచిస్తుండగా, ప్రతిపక్ష నేత ఉన్న ఇబ్బందులను గమనించి చొరవ తీసుకుని వాటికి పరిష్కారం చూపడం రాజీవ్ గాంధీ మంచితనానికి నిదర్శనంగా మారింది. ఏది ఏమైనా అప్పట్లో ఉన్న రాజకీయ విలువలు ఇప్పట్లో మచ్చుకైనా కానరావని చెప్పడానికి ఇలాంటి ఉదంతాలు చెప్తున్నాయి.