astrologeer about Chandrababu Naidu termమరికొద్ది నెలల్లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు దిగిపోతాడు.., మంచి కాలం మరెంతో దూరంలో లేదు.., రానున్నదంతా మనదే… అప్పటినుండి మీకు కష్టాలు అంటే ఏంటో తెలియవు… అంటూ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి గత రెండున్నర్ర సంవత్సరాలుగా చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలు ఈ మాటలను ఒంట పట్టించేసుకున్నారు. ఇదంతా ఓ జ్యోతిష్కుడు తనకు చెప్పాడంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సుపరిచితమే. దీంతో చంద్రబాబు పదవికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా గానీ మీడియా వర్గాలకు ప్రామాణికంగా మారుతోంది.

తాజాగా అదే చంద్రబాబు పదవిపై ప్రాముఖ్య జ్యోతిష్కుడు శ్రీనివాస గార్గేయ కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. “వచ్చే ఏడాది చంద్రబాబు పదవికి ఎటువంటి గండం లేదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడా ఉంటారని” శ్రీనివాస గార్గేయ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చేస్తోన్న మాటలకు కౌంటర్ ఎటాక్ గా పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. స్వయంగా సదరు జ్యోతిష్కుడే విషయాన్ని ప్రస్తావించడంతో టిడిపి వర్గాలకు శ్రీనివాస వ్యాఖ్యలు ఆయుధంగా మారాయి.

ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతం దేశ ప్రజలను పట్టిపీడిస్తున్న పెద్ద నోట్ల రద్దు సమస్యలు 2018వ సంవత్సరం వరకూ ఉంటాయని, ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలతో ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, అయినప్పటికీ ఆ ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నా, పరిపాలనకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఉండవని, పరిపాలన నిరాటంకంగా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. శ్రీనివాస గార్గేయ జ్యోతిష్యంపై నమ్మకం ఉన్న అధికార పార్టీ వర్గం ఈ వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది.

కొత్త సంవత్సరం జనవరి 27న ‘మౌని అమావాస్య’ సమస్యాత్మకమైందని, ఆ రోజున అందరూ మౌనం పాటించాలని, ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండాలని, అంతసేపు మౌనంగా ఉండటం వీలు కాని వారు, కనీసం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా మౌనంగా ఉండాలని, ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో మౌనం పాటించకపోతే గ్రహాల ప్రభావం మర్నాటి నుంచే ఉంటుందని హెచ్చరికలతో కూడిన సూచనలు చేసారు.