Asia Cup 2018 pakistan Vs Afghanistanఆసియా కప్ లో చెలరేగి ఆడుతోన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయాలకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. సూపర్ 4లో భాగంగా మొదలైన రెండో రౌండ్ లో పాకిస్తాన్ తో తలపడిన ఆఫ్ఘనిస్తాన్, దాదాపుగా పాక్ ను కూడా మట్టికరిపించినంత పనిచేసింది. చివరి ఓవర్ లో విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా, షోయబ్ మాలిక్ తన అనుభవంతో రెండవ బంతిని సిక్సర్ గా, మూడవ బంతిని బౌండరీగా మలిచి పాక్ కు విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్, నిర్ణీత 50 ఓవర్లలో 257 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను చేసింది. హష్మతుల్లః షాహిది 97 పరుగులతో అజేయంగా నిలువగా, కెప్టెన్ ఆఫ్ఘన్ 67 పరుగులు సాధించాడు. లక్ష్య చేధనలో తొలి ఓవర్లోనే వికెట్ ను కోల్పోయిన పాక్, రెండవ వికెట్ వెంటనే చేజారకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. ఇమామ్ – బాబర్ లు కలిసి 154 పరుగులు జోడించడంతో గాడిలో పడిన పాక్, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.

ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా, షోయబ్ మాలిక్ మాత్రం స్కోర్ బోర్డును కదిలిస్తూ జట్టుకు అండగా నిలిచి మ్యాచ్ ను పాక్ వైపుకు నిలిపాడు. రెండవ వికెట్ కోల్పోయిన తర్వాత రషీద్ ఖాన్ తన ప్రతిభ చూపడంతో మ్యాచ్ మళ్ళీ ఆఫ్ఘన్ చేతికి వచ్చింది. ఒకానొక దశలో ఆఫ్ఘనిస్తానే గెలుస్తుందని భావించగా, కేవలం షోయబ్ మాలిక్ అనుభవమే పాక్ ను రక్షించింది. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా షోయబ్ వశమైంది.